పీజీఆర్ఎస్ ఫిర్యాదుల సత్వర పరిష్కారం..
- అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి
- పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కారాదు..
- శాశ్వత పరిష్కారం చూపాలి
- సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం
- ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు
- జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ
(విజయవాడ, ఆంధ్రప్రభ ) : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకంతో పీజీఆర్ఎస్ ద్వారా తెలియజేస్తున్నందున, ప్రతి అర్జీని తమ సొంత సమస్యగా భావించి సత్వర, నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పెండింగ్‌లో ఉన్న, ఇప్పటికే పరిష్కరించిన పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పరిష్కార పురోగతిని కలెక్టర్ పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత వారం నుంచి పెండింగ్‌లో ఉన్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి క్లోజ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, ప్రతి అర్జీని పూర్తిగా పరిశీలించి సమస్యకు మూలకారణాన్ని గుర్తించి పరిష్కారం చూపాలని సూచించారు.

అవసరమైన సందర్భాల్లో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని, ఫిర్యాదుదారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి సంబంధం ఉన్న వ్యక్తులను ఒకచోట కూర్చోబెట్టి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, వాస్తవ పరిస్థితులను గుర్తించి వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. ఒకసారి పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతమయ్యే పరిస్థితి రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఫిర్యాదు పరిష్కరించబడిందనే విషయాన్ని కేవలం అధికారిక ప్రక్రియగా చూడకుండా, ఫిర్యాదుదారుడు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అందుకు గల కారణాలను ఫిర్యాదుదారులకు స్పష్టంగా వివరించి, తదుపరి తీసుకునే చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. ఎరువుల సరఫరా, పంటల మార్పిడి, ఇంటర్‌క్రాపింగ్ తదితర అంశాలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని, అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ విధానాలు, సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి అర్జీదారుడితో గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించి, వారి సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కరించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగంపై మరింత నమ్మకం కలిగేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ హెచ్చరించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచడం, నామమాత్రపు పరిష్కారాలు చూపించడం, సమస్యను పూర్తిగా పరిష్కరించకుండా అర్జీని క్లోజ్ చేయడం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 178 అర్జీలను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి. జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
