ముమ్మరంగా సాగుతున్న పనులు
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి(Sri Padamati Anjaneya Swamy) వారి పుష్కరిణి (కోనేరు) పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా కొనసాగుతున్న కోనేరు పునరుద్ధరణ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి.
అపమృత్యు దోష పరిహారకుడిగా కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులచే పూజలందుకుంటున్న శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారిని స్వయంగా జాంబవంతుల వారి ప్రతిష్టించారని ప్రతీతి. పశ్చిమముఖంగా ఆంజనేయ స్వామి దేవాలయాలు భారతదేశం మొత్తంలో రెండే ఉన్నట్లు అందులో దక్షిణ భారతంలో ఉన్న ఆలయం మక్తల్ పట్టణం(Maktal town)లోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది .గత కొన్ని దశాబ్దాలుగా కోనేరు మరుగునపడి చెత్తాచెదారం చేయడంతో ఒక మురికి కోపంగా మారిపోయింది.
దేవాదాయ శాఖ పూర్తి నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు భక్తుల నుండి వినపడుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) ప్రత్యేక చొరవతో కోనేరు పునరుద్ధరణ పనులను శ్రీకారం చుట్టారు .వచ్చే నెల డిసెంబర్ మాసంలో మొదటి వారంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాలనాటికి కోనేరును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి భక్తులకు స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునేందుకు అందుబాటులోకి తేవాలన్న మంత్రి సంకల్పంతో నెల రోజులుగా కొనసాగుతున్న పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. 15 రోజుల్లోగా పనులు పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు అక్కడ జరుగుతున్న పనులను బట్టి తెలుస్తోంది. మొత్తంమీద బ్రహ్మోత్సవాలనాటికి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చెరువుతో భక్తులకు కోనేరు అందుబాటులోకి రానుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

