రుద్రగూడెం సర్పంచ్‌కు మహిళల ఆత్మీయ సత్కారం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రుద్రగూడెం గ్రామం మహిళా శక్తికి వేదికైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మంద సుజాత రాజిరెడ్డికి గ్రామ మహిళలు ఆత్మీయ సన్మానం చేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ వేడుకను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయారు. మాజీ సర్పంచ్ కవిత విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేవలం సర్పంచ్‌గానే కాకుండా.. గ్రామ అభివృద్ధిలో ముఖ్యంగా మహిళల సంక్షేమంలో సుజాత రాజిరెడ్డి చేస్తున్న కృషిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. మహిళా దినోత్సవం రోజున ఒక మహిళా సర్పంచ్‌ను తోటి మహిళలు ఇలా సత్కరించడం గ్రామంలో సరికొత్త స్ఫూర్తిని నింపింది.

ఈ సన్మానోత్సవంలో మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, పలువురు వార్డు మెంబర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సీ.ఎ.లు, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఐక్యత, నాయకత్వ లక్షణాలను ఈ కార్యక్రమం స్పష్టంగా ప్రతిబింబించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేక సందర్భంలో సర్పంచ్ సుజాత రాజిరెడ్డి తమకు లభించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply