ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య…

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెందిన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మండలంలోని వెల్గనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దండేపల్లి ఎస్సై గూడేటి రాజవర్ధన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. వెల్గనూర్ గ్రామానికి చెందిన మెండె పద్మ (45) తన కుమారుడు రాకేష్‌తో కలిసి నివసిస్తోంది. గతంలో భర్త, పెద్ద కుమారుడు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.

దీనికి తోడు అప్పుల భారం పెరగడంతో పద్మ గత కొంతకాలంగా తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం ముగించుకుని పద్మ గదిలోకి వెళ్లగా, కుమారుడు రాకేష్ బయట నిద్రపోయాడు. శనివారం ఉదయం తల్లి పలకకపోవడంతో అనుమానం వచ్చిన రాకేష్, కిటికీలోంచి చూడగా తల్లి ఉరివేసుకుని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. తన తల్లి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకుందని కుమారుడు రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.