మల్లారెడ్డి వర్సిటీలో ఘనంగా అగ్రి అకాడమీ కాన్వొకేషన్..

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన మల్లారెడ్డి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో మూడో కాన్వొకేషన్ (గ్రాడ్యుయేషన్ డే) వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వివిధ కోర్సుల్లో విద్యను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి పట్టాలను అందజేశారు. విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ప్రశంసాపత్రాలను ప్రదానం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం కీలకమని, వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఇక్కడి నుంచి పట్టాలు పొందిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకలకు హైదరాబాద్‌లోని ఐక్రిశాట్ (ICRISAT) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పఠక్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ వి.ఎస్.కె. రెడ్డి, అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థుల ఆనందోత్సాహాలతో ఆడిటోరియం సందడిగా మారింది.