అమెరికా.. తెల్ల‌జెండా!

అమెరికా.. తెల్ల‌జెండా!

లెబనాన్, ఇజ్రాయెల్‌లో శాంతి గీతిక‌లు
ఇకమీద‌ట‌ ఉద్రిక్త‌త‌లు ఉండొద్ద‌న్న పెద్ద‌న్న‌
మ‌రో మూడు వారాలు కాల్పుల విర‌మ‌ణ పొడిగింపు
అమెరికాలో కొన‌సాగ‌తున్న చ‌ర్చ‌ల్లో పురోగ‌తి
శాశ్వ‌త కాల్పుల విర‌మ‌ణ‌పై కొన‌సాగుతున్న చ‌ర్చ‌లు

సెంట్ర‌ల్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్)ను మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు అంగీకారం కుదిరింది. వైట్‌హౌస్‌లో జరిగిన కీలక భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దక్షిణ లెబనాన్‌లో దాడులు కొనసాగుతున్నప్పటికీ, ఈ మూడు వారాల వ్యవధిలో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వైట్‌హౌస్‌లో కీలక చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఇజ్రాయెల్ రాయబారి యేచీల్ లైటర్, లెబనాన్ రాయబారి నదా మోవావాద్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 17న కుదిరిన 10 రోజుల కాల్పుల విరమణ ఆదివారం (ఏప్రిల్ 27)తో ముగియాల్సి ఉంది. ఈ గడువు ముగియడానికి ముందే ట్రంప్ ప్రభుత్వం చొరవ చూపి మరో 21 రోజుల పాటు సీజ్‌ఫైర్‌ను పొడిగించేలా ఒప్పించింది. శాంతి ఒప్పందంపై ట్రంప్ ఆశలు సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆవున్‌లను అమెరికాకు ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మూడు వారాల గడువులోగా శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. లెబనాన్ ప్రభుత్వం హిజ్బుల్లాను అదుపు చేసేలా అమెరికా సహకరిస్తుందని, దీనివల్ల ఇజ్రాయెల్‌కు రక్షణ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

దక్షిణ లెబనాన్‌లో ఆగ‌ని దాడులు..

ఒకవైపు చర్చలు జరుగుతుంటే, మరోవైపు దక్షిణ లెబనాన్‌లో దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఒక జర్నలిస్టు సహా ఐదుగురు మరణించారు. లెబనాన్ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో అడపాదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది కాలంగా జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ప్రస్తుతం దక్షిణ లెబనాన్‌లోని 5 నుంచి 10 కిలోమీటర్ల మేర బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసి తన ఆధీనంలో ఉంచుకుంది.

లెబనాన్ డిమాండ్లు ఇవే..

శాంతి ఒప్పందంలో భాగంగా లెబనాన్ కొన్ని కీలక డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని లెబనాన్ భూభాగం నుంచి వెనక్కి తీసుకోవాలని, సరిహద్దు గుర్తింపులో స్పష్టత ఉండాలని, అలాగే బందీలను విడుదల చేయాలని కోరింది. ఇందుకు ప్రతిగా హిజ్బుల్లాను నిరాయుధులను చేసేందుకు లెబనాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రాబోయే మూడు వారాలు మధ్య ప్రాచ్య దేశాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Leave a Reply