బెల్లంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌కు ‘మోక్షం’ ఎప్పుడు ?
- మూడేళ్ళు కావస్తున్న కానరాని పరిశ్రమల జాడ.. ఆవిరవుతున్న నిరుద్యోగుల ఆశలు
- 355 ఎకరాల భూమి కేటాయింపు.. రూ.36.87 కోట్లతో వసతులు కల్పించినా నిర్లక్ష్యం
- గెలిస్తే సొంతంగా పరిశ్రమ పెడతానన్న హామీని విస్మరించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్!
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం పూర్వం నుంచి బొగ్గుగనుల పారిశ్రామిక పట్టణంగా దేశ, రాష్ట్ర స్థాయిల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అయితే, ఈ ప్రాంతంలో ఒక్కొక్కటిగా బొగ్గుగనులు మూతపడటం, ఇక్కడ ఉన్న పలు శాఖలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఈ పారిశ్రామిక పట్టణం పూర్తిగా నిర్వీర్యమైంది. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల మద్దతుతోనే ఈ పట్టణం కలకలలాడుతోంది.
బొగ్గుగనులు మూతపడటంతో ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2023 మే 8న బెల్లంపల్లి పట్టణంలో ప్రత్యేక ఆహార శుద్ధి జోన్ (స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్) ఏర్పాటుకు నాంది పలికింది. నాటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దాదాపు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
అయితే, శంకుస్థాపన జరిగి మూడేళ్లు గడుస్తున్నా నేటి ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ఊసే ఎత్తకపోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రత్యేక ఆహార శుద్ధి జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో బెల్లంపల్లి ప్రజల్లో ఆశలు చిగురించినా, ఆచరణలో మాత్రం నిరాశే మిగిలింది.
355 ఎకరాల భూమి.. 70 శాతం వసతులు పూర్తి!
ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం బెల్లంపల్లి మండలంలోని కన్నాల, బుధకలాన్ గ్రామ పంచాయతీల పరిధిలోని 12 సర్వే నంబర్లలో గల మొత్తం 355.03 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. కన్నాల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 65లో 0.30 ఎకరాలు, 66లో 0.20 ఎకరాలు, 67లో 3 ఎకరాలు, 69లో 0.20 ఎకరాలు, 80లో 64.38 ఎకరాలు, మరో భాగంలో 6.36 ఎకరాలు, 81లో 8.26 ఎకరాలు, 82లో 8.33 ఎకరాలు, 83లో 7.08 ఎకరాలు, 84లో 2.08 ఎకరాలు, 85లో 1.27 ఎకరాలు, 86లో 6.16 ఎకరాలు, 87లో 125.01 ఎకరాలు ఉన్నాయి. అలాగే బుధకలాన్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 170లో 119 ఎకరాల భూమిని సేకరించారు.
ఈ కేటాయించిన స్థలంలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణ పనులను 70 శాతం వరకు పూర్తి చేశారు. పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్ మంజూరు చేయగా, రూ.6.87 కోట్ల వ్యయంతో కొత్త సబ్‌స్టేషన్‌ను కూడా నిర్మించారు.తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అధికారులు ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించినప్పటికీ, ఆ పనులు ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయాయి. రూ.36 కోట్లకు పైగా ఖర్చు చేసి ఇంతటి మౌలిక వసతులు సిద్ధం చేసినప్పటికీ, 2023 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడం గమనార్హం.

ఎమ్మెల్యే హామీ ‘నీటి మూట’..
ఎన్నికల సమయంలో “నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బెల్లంపల్లిలో నేనే స్వయంగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాను” అని బహిరంగంగా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, గెలిచిన తర్వాత ఆ మాటను పూర్తిగా విస్మరించారని స్థానిక యువత మండిపడుతోంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నరేళ్లు గడిచిపోయినా, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విషయంపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్పందించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల పదవీకాలంలో సగం కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, మిగిలిన కాలంలోనైనా ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి బెల్లంపల్లిలో పరిశ్రమలు వచ్చేలా చొరవ చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్ నిధులు తెప్పించాలి : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
“బెల్లంపల్లి ప్రాంతంలో భూగర్భ గనులు మూసివేయడంతో లక్షలాది మంది ప్రజలతో కళకళలాడిన ఈ పట్టణం నిర్వీర్యమైంది. నాడు చంద్రబాబు నాయుడు హయాంలో డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేయడంతో ఇక్కడ నిరుద్యోగ యువత సంఖ్య మరింత పెరిగింది. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా మూడేళ్ళు కావస్తున్నా బెల్లంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అంతేకాకుండా, ఈ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నందున పరిశ్రమలు వచ్చేలా ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా మంత్రి వివేక్ వెంటనే చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల ఏర్పాటుకు నిధులు తెప్పించాలి. అవసరమైతే యువతను సమీకరించి జిల్లా వ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు చేపడతాం” అని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
నిధులు కేటాయించకుంటే నిరవధిక ఆందోళనలు: మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి
“గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో నేటికీ పరిశ్రమలు రాకపోవడానికి నాటి, నేటి ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి, వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఈ జోన్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి తక్షణమే నిధులు కేటాయించాలి.
ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి పట్టణంపై నిర్లక్ష్యాన్ని వీడాలి. లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో కలిసి జిల్లా కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
