త్వరలోనే జగన్ కు రాజకీయ చరమగీతం…
- 2029లో వైసీపీ శాశ్వత సమాధి…
- అమరావతిపై యూటర్న్‌తో రాష్ట్ర భవిష్యత్తును పణం..
- రాజధాని అంశంలో అయోమయంలో జగన్…
- అమరావతి రైతుల త్యాగాలను అవమానిస్తున్న వైసిపి..
- నిత్యం తప్పు దోవ పట్టించే ప్రయత్నం
- రాష్ట్ర భవిష్యత్తుతో రాజకీయ ప్రయోగాలు
- మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాదు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : అతి త్వరలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ చర్మ గీతం పలకనుందని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్ట్రాన్ని సాధించారని, అనంతరం దురదృష్టకర పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందని వసంత పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల సమయంలో అమరావతినే రాజధానిగా అంగీకరించి అధికారంలోకి వచ్చిన జగన్, తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని, ఇప్పుడు మరోసారి కొత్త వాదనలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు.
అమరావతి కోసం వేలాది మంది రైతులు భూములు త్యాగం చేశారని, వారి త్యాగాలను వైసీపీ ప్రభుత్వం అవమానించిందన్నారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుతో రాజకీయ ప్రయోగాలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.
జగన్ రాజకీయ వైఖరి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆరోపించిన వసంత కృష్ణప్రసాద్, ఆయనపై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు. జగన్ మానసిక స్థితిపై కూడా వ్యాఖ్యానిస్తూ, ప్రజాస్వామ్యంలో ఆయన అనుసరిస్తున్న తీరు వికృత రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రం ఇలాంటి నాయకత్వం చేతుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు వ్యక్తిగతంగా నష్టం ఉండదని, కానీ రాష్ట్ర యువత, రాబోయే తరాల భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని వ్యాఖ్యానించారు.
అమరావతి రైతులకు జరిగిన అన్యాయం, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు బాగా గుర్తుంచుకున్నారని పేర్కొన్న ఆయన, ఈ రాష్ట్రం నుంచి జగన్ రెడ్డిని రాజకీయంగా ఓడించడమే ప్రతి తెలుగు వ్యక్తి లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో జగన్ రాజకీయ అధ్యాయానికి ముగింపు పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఏకమై ముందుకు రావాలని కోరారు.
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్న వసంత, విభజన తర్వాత కోలుకునే దశలో రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం మరింత వెనక్కి నెట్టిందని ఆరోపించారు. జగన్ శాశ్వతంగా రాజకీయంగా పరాజయం పాలైతేనే రాష్ట్రానికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పథకాలను రద్దు చేయకుండా కొనసాగిస్తూ తనదైన శైలిలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని, అయితే జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి మార్గం నుంచి తప్పిపోయిందని విమర్శించారు.జగన్‌ను “దేశానికి టెర్రరిస్టు కంటే ప్రమాదకరమైన వ్యక్తి”, “ఆంధ్ర జాతికి అపశకునం”, “ప్రజాస్వామ్యంలో వికృత పోకడలకు ప్రతీక”గా అభివర్ణిస్తూ, ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే “నీ తల్లి విజయమ్మ గనుక ఈ పరిస్థితిని ఊహించి ఉంటే…అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
