జొన్నల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాసిన లేఖను జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి బీజేపీ వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తమ పంటను సరైన ధరలకు విక్రయించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో రైతులు నష్టపోయే పరిస్థితుల్లో తక్కువ ధరలకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు.
అదిలాబాద్ వంటి జిల్లాల్లో ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు. అక్కడి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయిస్తున్నారని తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమయానుకూలంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వారి ప్రయోజనాలు కాపాడబడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రొంపల్లి సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు స్రవంతి శ్యామ్ రెడ్డి, రుచిత సాయిచరణ్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు సాయిచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
