Vizag Steel Plant | ల్యాడిల్ లీక్..
Vizag Steel Plant | ల్యాడిల్ లీక్..
ఉద్యోగుల్లో ఆందోళన…
Vizag Steel Plant | ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో : విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఎస్‌ఎంఎస్-1 సీసీడీ విభాగంలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే, గత రెండు రోజులుగా మరోసారి ప్రమాదాలు చోటుచేసుకోవడం ఉద్యోగులను కలవరపెడుతోంది.
బుధవారం ఎస్‌ఎంఎస్-2 విభాగంలో ల్యాడిల్ నుంచి ఉక్కు ద్రవం లీకై నేలపాలైన ఘటన చోటుచేసుకుంది. అనంతరం గురువారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో ఎస్‌ఎంఎస్-1 టిపిబే విభాగంలో ల్యాడిల్‌కు రంధ్రం ఏర్పడటంతో స్టీల్ మెటల్ భారీగా నేలపైకి చేరింది.
అయితే ఈ రెండు ఘటనల్లో ఉద్యోగులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తాజా ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఘటనలకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
