వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే మేలు

వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు విత్తనాల పంపిణీ..

సాగుపై అధికారుల సూచనలు

రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ రైతువేదికలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 27 నుంచి 29 వరకు విత్తనమేళ నిర్వహిస్తున్నారు.

మండలంలో జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువగా 30 శాతం మాత్రమే వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు బోరుబావులు, చెరువుల కింద వరి పంట సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు.

వరి స్థానంలో అపరాల పంటలైన పెసర, మినుము, కంది సాగు చేసుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా మొక్కజొన్న, జొన్న పంటలు కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య హాజరై మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అపరాల పంటలను సాగు చేసుకోవాలని కోరారు.

అనంతరం రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అపరాల విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏడీఏ రమేష్, మండల వ్యవసాయ శాఖ అధికారి వాసుదేవరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు భరత్, గోవర్ధన్, ప్రవళిక, రైతులు తదితరులు పాల్గొన్నారు.