ఉర్దూ భాషాభివృద్ధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం..
ఆగస్టు 15 నుంచి 36 కేంద్రాల్లో కంప్యూటర్ కోర్సుల ప్రారంభానికి నిర్ణయం
ఏపీటీఎస్‌పై అసంతృప్తి.. పరికరాల సరఫరాపై కఠిన వైఖరి
ఉర్దూ ఘర్-కమ్-షాదీఖానాల నిర్వహణకు విధాన సవరణల ప్రతిపాదనలు
( విజయవాడ ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 22వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఉర్దూ భాషాభివృద్ధి, మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ల బలోపేతం, ఉర్దూ గ్రంథాలయాల అభివృద్ధి, ఉర్దూ ఘర్-కమ్-షాదీఖానాల సమర్థ నిర్వహణ వంటి పలు కీలక అంశాలకు సంబంధించిన తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మంగళగిరిలోని ఉర్దూ అకాడమీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ ఫారూఖ్ షిబ్లీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 కంప్యూటర్ శిక్షణా కేంద్రాల్లో ఆగస్టు 15 నుంచి తప్పనిసరిగా ఏడీసీఏ, మల్టీ లాంగ్వేజ్ డీటీపీ కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించారు.
అలాగే కంప్యూటర్ పరికరాల సరఫరాలో జాప్యంపై ఏపీటీఎస్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సరఫరా చేయని పరికరాల నిధులను వెంటనే తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. సమావేశానికి మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ చిత్తూరి శ్రీధర్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జంపాని శివయ్య, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, బోర్డు సభ్యుడు మెహబూబ్ బాషా, డైరెక్టర్-కార్యదర్శి మహమ్మద్ నిజాముద్దీన్ తదితరులు హాజరై అజెండాలోని అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఉర్దూ భాష ప్రోత్సాహానికి అవసరమైన సాహిత్య ప్రచురణలు, గ్రంథాలయాల అభివృద్ధి, సేవా నియమావళి, కారుణ్య నియామకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే శిక్షణ కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా ఆధునిక కంప్యూటర్ విద్యను మరింత విస్తరించాలని బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలోని ఉర్దూ ఘర్-కమ్-షాదీఖానాల నిర్వహణ, ఆదాయ వృద్ధి, ఆస్తుల పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన, ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల్లో అవసరమైన సవరణల కోసం ప్రత్యేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని బోర్డు తీర్మానించింది. రాష్ట్రంలోని 36 కంప్యూటర్ శిక్షణా కేంద్రాల కోసం ఏపీటీఎస్‌కు నిధులు విడుదలైనప్పటికీ కంప్యూటర్ వ్యవస్థల సరఫరా, ఏర్పాటు ఆలస్యం కావడంపై బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సరఫరా చేయని పరికరాలకు సంబంధించిన నిధులను వెంటనే తిరిగి చెల్లించాలని ఏపీటీఎస్‌కు లేఖ రాయాలని, అవసరమైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాల అమలుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడం, సంబంధిత శాఖలతో సమన్వయం చేయడం, నిర్ణయాలను వేగంగా అమలు చేయడం కోసం ఉర్దూ అకాడమీ డైరెక్టర్-కార్యదర్శికి పూర్తి అధికారాలు అప్పగిస్తూ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం ముగిసింది.
