రోగుల సేవే ధ్యేయం: జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్
రోగుల సేవే ధ్యేయం: జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్
విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడమే తన ప్రధాన కర్తవ్యమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ స్పష్టం చేశారు.
ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యతను మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని, రోగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇందుకోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతి పేషెంట్‌కు సమయానుకూలంగా, సమర్థవంతంగా చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోగులు అనారోగ్యంతో, మానసిక ఆందోళనతో ఆసుపత్రికి వస్తారని, అలాంటి సమయంలో సిబ్బంది వారితో మర్యాదపూర్వకంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
రోగుల సమస్యలను ఓపికగా విని, వారి బాధను అర్థం చేసుకుని సేవలు అందించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. ఆసుపత్రిలో ఎలాంటి అక్రమాలు, నిర్లక్ష్యానికి తావు ఉండదని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రతి పేషెంట్ తమకు ముఖ్యమని, రోగుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రిపై విశ్వాసం పెంచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
వైద్యులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి రోగులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
