Vision-2047 | విజన్-2047 లక్ష్యంగా ముందుకు

Vision-2047 | విజన్-2047 లక్ష్యంగా ముందుకు
Vision-2047 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని సీఎం తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కార్యాచరణ కొనసాగుతోందన్నారు.
తెలంగాణ సమాజం రాచరికాన్ని, పెత్తన ధోరణులను ఎప్పటికీ సహించదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. ‘‘తెలంగాణ విజన్-2047’’ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా మరింత వేగంగా ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు.
