జేఎల్‌ఎంల సేవలను రెగ్యులరైజ్ చేయాలి..

  • చౌటుప్పల్ డీఈకు విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ విద్యుత్ డివిజన్ పరిధిలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు శుక్రవారం చౌటుప్పల్ డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ (డీఈ) మల్లికార్జున గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. 2023 బ్యాచ్‌కు చెందిన జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం)ల ప్రొబేషన్ కాలం పూర్తయినందున వారి సేవలను వెంటనే రెగ్యులరైజ్ చేసి కన్ఫర్మేషన్ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన డీఈ మల్లికార్జున గౌడ్.. రానున్న సోమవారం నాటికి కన్ఫర్మేషన్ ఆర్డర్లు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అదేవిధంగా ఆర్టిసన్ ఉద్యోగులందరికీ గ్రేడ్ మార్పునకు సంబంధించిన వివరాలను కార్పొరేట్ కార్యాలయానికి పంపించాలని, డివిజన్ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లలో ఉద్యోగుల భద్రత కోసం అవసరమైన సేఫ్టీ మెటీరియల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంఘం ప్రతినిధులు అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బోయ మల్లేష్, డివిజన్ కార్యదర్శి ముత్యాల బిక్షపతి, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోదుల జంగయ్య, చౌటుప్పల్ సబ్‌డివిజన్ నాయకుడు చుక్క భాస్కర్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.