విశాఖలో యువతిపై కత్తెరతో దాడి కలకలం: తీవ్రంగా గాయపడిన యువతి
విశాఖలో యువతిపై కత్తెరతో దాడి కలకలం: తీవ్రంగా గాయపడిన యువతి
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: పెందుర్తి మండలం దుగ్గవానిపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గతంలో నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన వివాదం మళ్లీ తెరపైకి రావడంతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం పాయకరావుపేటకు చెందిన ఓ యువకుడిపై గతంలో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన విషయాలపై యువతి, యువకుడి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువకుడు కత్తెరతో యువతి మెడపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల పూర్తి కారణాలు, నిందితుడి పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో దుగ్గవానిపాలెం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
