ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
- ఎమ్మెల్యే వేగేశేన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలోని కాన్స్టిట్యూయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (పి 4) కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక ఎమ్మెల్యే వేగేశేన నరేంద్ర వర్మ రాజుకు వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా రవాణా సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా బాపట్లకు త్వరలోనే 40 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. దీంతో ప్రయాణికులకు ఆధునిక, సౌకర్యవంతమైన, పర్యావరణహిత రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. రజిని, జేఏసీ కన్వీనర్ వై. నరసింహారావు, వై. శ్రీనివాసరావు, కన్వీనర్ బి.టి. రెడ్డి తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
