కాలుష్య రహిత విజయవాడ లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షన్ చర్యలు..

కాలుష్య రహిత విజయవాడ లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షన్ చర్యలు..

విజయవాడ,(కార్పొరేషన్) ఆంధ్రప్రభ : స్వచ్ఛ, కాలుష్య రహిత విజయవాడ లక్ష్యంగా నగరాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి మంగళవారం ప్రధాన కార్యాలయంలోని చాంబర్‌లో నగరాభివృద్ధి, స్వచ్ఛ సర్వేక్షన్ చర్యలు, ఆపరేషన్ క్లీన్ స్వీప్, బక్రీద్ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర సౌందర్యాన్ని పెంపొందించేందుకు ప్రధాన కూడళ్లలో ఆధునిక ఫౌంటెన్లు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో రహదారులు, పార్కుల అభివృద్ధి, నిర్వహణ పనులను మరింత సమర్థవంతంగా చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

స్వచ్ఛ సర్వేక్షన్–2026లో విజయవాడకు మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంపై విఎంసీ చేపడుతున్న చర్యలను సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా నగరవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల పురోగతిని ఆయన పరిశీలించారు.

బహిరంగ మలమూత్ర విసర్జన పూర్తిగా నివారించబడినప్పటికీ ఆ పరిస్థితిని నిరంతరం కొనసాగించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యల్లో భాగంగా అద్దాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కబేళాల నిర్వహణ, పారిశుధ్య చర్యలు, తాగునీటి సౌకర్యాలు, వ్యర్థాల సకాలంలో తొలగింపు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. గోవధ నిషేధం, జంతు సంక్షేమ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, సీఎంహెచ్‌వో డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇన్‌చార్జ్ పి. సత్యకుమారి, సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply