ఆస్పత్రులపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

ఆస్పత్రులపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

-ఎండల వేళ అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు
-గర్భిణుల సేవలు, డెంగ్యూ–మలేరియా పరిస్థితిపై ప్రత్యేక సమీక్ష
-తాగునీటి నుంచి ల్యాబ్ పరీక్షల వరకు క్షుణ్ణ పరిశీలన
-ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టర్ సుహాసిని

రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ:
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం. సుహాసిని రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు తగిన త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారా లేదా అన్న అంశాన్ని స్వయంగా పరిశీలించిన ఆమె, ప్రతిరోజూ నమోదవుతున్న ఓపీ వివరాలను పరిశీలించి వైద్యాధికారులను ఆరా తీశారు. సిబ్బంది హాజరు, పనితీరు, వైద్య సేవల పురోగతి నివేదికలను సమీక్షిస్తూ సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని సూచించారు.

అనంతరం స్టాఫ్ నర్స్‌లతో మాట్లాడిన డీఎంహెచ్‌వో, ఆస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీల వివరాలు, ప్రతి నెల నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమానికి హాజరు శాతం, ఈ వారంలో జరగనున్న కాన్పుల అంచనా తేదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా మలేరియా అధికారితో సమావేశమైన ఆమె, జిల్లాలో నమోదవుతున్న డెంగ్యూ, మలేరియా కేసుల పరిస్థితిని సమీక్షించారు. వ్యాధుల నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.

ల్యాబొరేటరీ విభాగాన్ని పరిశీలించిన డాక్టర్ సుహాసిని, రక్తపరీక్షల నిర్వహణ, రిపోర్టుల జారీ విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో మందుల నిల్వలు, ప్రజలకు అందుతున్న ఔషధాల వివరాలను తెలుసుకున్నారు. అలాగే అబ ఐడి నమోదు, ఈ హెచ్ ఆర్ ఆన్‌లైన్ సేవల అమలు తీరును కూడా సమీక్షించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసర మందులు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

Leave a Reply