వర్షపు నీటి సంరక్షణతో భూగర్భ జలాల పెంపు…

వర్షపు నీటి సంరక్షణతో భూగర్భ జలాల పెంపు…

చెరువుల నింపుదలకు వేగవంతమైన చర్యలు అవసరం…
సి.సి.ఎల్.ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకునే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సి.సి.ఎల్.ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి అధికారులకు సూచించారు. వర్షకాలం ప్రారంభానికి ముందే జిల్లాలోని చెరువులు పూర్తిగా నిండేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

గురువారం ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీలు సురేష్ కుమార్, హరి జవహర్లాల్, జయలక్ష్మి, ప్రశాంతి పాల్గొని జలధార–జలహారతి, 22-A నిషేధిత భూ జాబితా, పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువుల్లో అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

చెరువులు, పంటకాలువలు, నీటి కుంటలలో పూడికలు తొలగించి వర్షపు నీటిని నిల్వ చేసుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా 22-A నిషేధిత భూ జాబితా, రీ-సర్వే, పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ-కైవైసీ, వెబ్‌ల్యాండ్ సవరణలు పూర్తి చేసి డ్రాఫ్ట్ పాస్‌బుక్స్ సిద్ధం చేసి హక్కుదారులకు అందజేయాలని సూచించారు. గ్రౌండ్ ట్రూతింగ్ సర్వేలను నాలుగో, ఐదో దశల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

స్వచ్ఛభారత్ మిషన్ కింద కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు, పీఎస్టీపీ, ఎస్టీపీ వంటి వ్యర్థ నిర్వహణ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించి సేకరించాలని సూచించారు. జిల్లాలోని 481 గ్రామాల్లో గుర్తించిన 3,435 జలధార–జలహారతి పనులను వేగంగా ప్రారంభించి పూర్తి చేయాలని, ముఖ్యంగా 239 చెరువులు, అటవీ చెరువులు, పంటకాలువలు, నీటి కుంటల అభివృద్ధి పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని ఆదేశించారు.

దేవాలయాల పుష్కరిణులు, కోనేరులు, ధర్మ చెరువులను కూడా ఈ కార్యక్రమంలో చేర్చి శుభ్రపరచి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే దేవాలయ నిధులను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇన్‌చార్జ్ డీఆర్ఓ చిరంజీవి, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బాలచంద్రారెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, ఎస్‌డీసీ నాగప్రసూన, డీడీ ఫిషరీస్ రంగనాథ్ బాబు, గ్రౌండ్ వాటర్ డీడీ సునీల్ కుమార్, ఏడి సర్వే మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.