పౌష్టికాహారంతో ఆరోగ్యకరమైన జీవితం…

పౌష్టికాహారంతో ఆరోగ్యకరమైన జీవితం…
- మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఆరోగ్యకరమైన, చురుకైన జీవితానికి పౌష్టికాహారం పునాది అని మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఐసీడీఎస్ సీడీపీవో పుష్పలత అధ్యక్షతన గురువారం పోషణ పక్వాడా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీర ఎదుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, వ్యాధుల నివారణకు, మెదడు పనితీరుకు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.

శారీరక, మానసిక ఆరోగ్యానికి పౌష్టికాహారం అత్యంత ముఖ్యమన్నారు. సీడీపీవో పుష్పలత మాట్లాడుతూ పిల్లల మెదడు అభివృద్ధి రెండు సంవత్సరాల్లోపు 80 శాతం జరుగుతుందని, కనుక ఆ వయస్సులో సంరక్షణ, పోషణ అత్యవసరం అన్నారు. విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అసోసియేట్ సిహెచ్.దివ్యశ్రీ బ్యాలెన్స్ డ్ డైట్ గురించి, జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు.

అనంతరం వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ ప్రేమ్ చంద్, కో – ఆప్షన్ సభ్యుడు మహబూబ్, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు మాధవి, శివకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
