పశువైద్య సేవల నిర్లక్ష్యంపై వెటర్నరీ డాక్టర్ల ఆగ్రహం..
విఎఎస్ పోస్టుల భర్తీ, శాఖ బలోపేతం కోరిన వైద్యులు..
ఏలూరులో కలెక్టరేట్ వద్ద నిరసన..
ఏలూరు, ఆంధ్రప్రభ : పశువైద్య సేవలు, అత్యవసర వైద్య సేవల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ జిల్లా వెటర్నరీ డాక్టర్లు సోమవారం ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (విఎఎస్) పోస్టులను వెంటనే భర్తీ చేసి, వెటర్నరీ క్లినికల్ సర్వీస్‌ను మెరుగుపరచడంతో పాటు పశుసంపద శాఖను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, పశువైద్య సేవలు అత్యవసర సేవల పరిధిలోకి వస్తాయని, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు సకాలంలో వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విఎఎస్ డాక్టర్ల కొరత కారణంగా రైతులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వెటర్నరీ క్లినికల్ సర్వీస్‌ను ఆధునీకరించి, పశుసంపద శాఖకు తగిన నిధులు, సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానాలను పునఃసమీక్షించి, వెటర్నరీ వైద్యులకు అనుకూలంగా మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. “పశుసంపద బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది” అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. మా హక్కుల కోసం కాదు.. పశుసంపద వృద్ధి కోసం మార్పు తేవాలి అనే నినాదంతో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డా. శివరామకృష్ణ, డా. అజయ్, డా. చిరంజీవి, డా. సాయి తేజ, డా. సుఖేష్, డా. అనిల్, డా. మాధవీలత, డా. ప్రణీత, డా. సతీష్ కుమార్, డా. గణేష్ తదితర వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు.
