పిఠాపురం ప్రజలకు కష్టాల్లో అండగా ఉంటాం: నాగబాబు
పిఠాపురం, ఆంధ్రప్రభ: జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ప్రజలను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని శాసనమండలి సభ్యుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని రాపర్తి గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు మల్లారపు అబ్బులు వైద్య చికిత్స కోసం మంజూరైన రూ.6 లక్షల ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) చెక్కును నాగబాబు శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలకు ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ అవసరమైన సహాయం అందిస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన సేవలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు, పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరాం, జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్, రాజేష్, అలాగే అబ్బులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
