భవనమున్నా భాగ్యం లేదు!

  • ఏళ్లుగా అసంపూర్తిగానే అంగన్‌వాడీ భవనం..
  • ఉపాధి హామీ నిధులు ఖాళీ..
  • మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఎదురుచూపులు

కామవరపుకోట, ఆంధ్రప్రభ : ఏళ్ల క్రితం ప్రారంభించిన అంగన్‌వాడీ భవన నిర్మాణం నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని ఫౌండేషన్ స్కూల్ ప్రాంగణంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ సెంటర్-4 భవనం అసంపూర్తిగా ఉండటంతో ప్రస్తుతం పాత రేకుల షెడ్డులోనే కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.7 లక్షల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సుమారు రూ.5 లక్షలు వెచ్చించి పునాదులు, గోడలు, స్లాబ్ వరకు పనులు పూర్తి చేశారు. అయితే ఉపాధి హామీ నిధులు పూర్తవడంతో పాటు రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విడుదల కాకపోవడంతో నిర్మాణం అక్కడే నిలిచిపోయింది.

అధ్వానంగా మారిన భవనం

నిర్మాణం పూర్తికాకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్లాస్టరింగ్, తలుపులు, కిటికీలు లేకపోవడంతో భవనం చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగి అపరిశుభ్రంగా మారింది. సొంత భవనం అందుబాటులో లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాన్ని పక్కనే ఉన్న పాత రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. వేసవిలో రేకుల షెడ్డు తీవ్రంగా వేడెక్కుతుండటంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి

అంగన్‌వాడీ భవనం పూర్తయితే చిన్నారులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యతో పాటు పోషకాహార సేవలు అందుతాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి, అసంపూర్తిగా ఉన్న భవనాన్ని త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.