కోట పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..

  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని చారిత్రక రాజు గోండుల కోటను శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు కలిసి సందర్శించారు. కోట పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల వివరాలను మ్యాప్ ద్వారా సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు.

అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గోండు రాజుల చరిత్రకు, గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన రాజు గోండుల కోటను త్వరితగతిన పునర్నిర్మించి, ఆధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

కోట పునర్నిర్మాణంలో చారిత్రకతకు భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గోండు రాజుల వంశ చరిత్ర, వారి పాలన, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ ఆనవాళ్లు, పురాతన వస్తువులు, చారిత్రక ఆధారాలను ప్రతిబింబించేలా అత్యాధునిక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.

అలాగే కోట ప్రాంగణంలో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక, గిరిజన హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయానికి మార్కెటింగ్ స్టాల్స్, చిన్నారుల కోసం పార్కు, క్రీడా ప్రాంగణం, సందర్శకుల కోసం రూఫింగ్ షెడ్లు, విశ్రాంతి భవనాలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఉద్యానవనాలు, విద్యుద్దీపాల అలంకరణ, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

పర్యాటకులు కోట చరిత్రను సులభంగా తెలుసుకునేలా సమాచార ఫలకాలు, దిశానిర్దేశక బోర్డులు, డిజిటల్ సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోట అభివృద్ధి ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఉట్నూర్ ప్రాంతం పర్యాటక రంగంలో గుర్తింపు పొందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

రాజు గోండుల కోటను సుందరీకరించి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, ఆర్కియాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు, అడిషనల్ డైరెక్టర్ నరసింహులు, డీడీ సాగర్, ఓఎస్‌డీ రాజు, టూరిజం శాఖ అధికారి రవికుమార్, ఈఈ జాదవ్ తానాజీ, ఏపీఓ పిబిటిజి ఆత్రం భాస్కర్, డిప్యూటీ డీఈఓ గోడం చందన్, జేమ్స్ కోట ఇంజనీర్, ఆర్ అండ్ బి అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.