ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని డీఆర్వో రాము పిలుపునిచ్చారు. శుక్రవారం దండేపల్లిలోని ఉన్నత పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.ప్లాస్టిక్ వినియోగం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు తమ ఇళ్లలో, పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా బట్ట సంచులను వినియోగించాలని సూచించారు. అటవీ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంగర్శ్ రాజేశ్వరరావు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమని, ఈ సందేశాన్ని విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు కూడా చేరవేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ బీవో క్రిష్ణ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
