రైతుముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం…

రైతుముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం…

నేల సారవంతం, నాణ్యమైన విత్తనాలు, పంటల దిగుబడుపై అవగాహన…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల రైతు వేదిక భవనంలో బుధవారంరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుకార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ,వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సంయుక్తంగానిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో గణేష్ రెడ్డి, సహాయ సంచాలకులు డా. ఎం. మాధవి నేతృత్వంలో రైతులకు నేల ఆరో్గ్య పరిరక్షణ, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సాగునీటి నిర్వహణ వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ముఖ్యంగా యూరియా ఎరువుల సముచిత సిఫారసు చేసిన మోతాదుల వినియోగం పై రైతులకు వివరించారు. అధిక మోతాదులో యూరియా వినియోగించడం వల్ల నేలలో పోషకాల అసమతుల్యత ఏర్పడి నేల ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. మట్టిపరీక్షల ఆధారంగా అవసరమైన మోతాదులో మాత్రమే యూరియాను వినియోగించాలని సూచించారు. విడతల వారీగా యూరియా వినియోగించడం ద్వారా నత్రజని వినియోగ సామర్థ్యం పెరిగి పంటలకు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. పచ్చి ఎరువు పంటలు పప్పుధాన్య పంటల సాగు ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చి ఎరువు పంటలను సాగు చేసి నేలలో కలపడం వల్ల సేంద్రియ కార్బన్ పెరిగి నేల సారం మెరుగుపడుతుందని వివరించారు. పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్య పంటలు వాతావరణంలోని నత్రజనిని నేలలో స్థిరపరచి నేల సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని రైతులకు వివరించారు.

నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. కల్తీ వి తనాల నివారణ చర్యలు, రైతులు ధృవీకరించబడిన సంస్థల నుండి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనాల రసీదులను తప్పనిసరిగా భద్రపరచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో విత్తనాల నాణ్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు ఈ రసీదులు రైతులకు ఆధారంగా ఉపయోగపడతాయని వివరించారు.సాగునీటి నిర్వహణ పై రైతులకు శాస్త్రీయ సూచనలు అందించారు. పంట దశను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే నీటిని వినియోగించడం ద్వారా నీటి వృథాను తగ్గించడంతో పాటు దిగుబడులను పెంచుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా నీటి కొరత పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేసే పద్ధతులను అనుసరించాలని సూచించారు.పంట అవశేషాల విలువ ఆధారిత వినియోగం పై కూడా రైతులకు అవగాహన కల్పించారు. వరి గడ్డి ఇతర పంట అవశేషాలను పుట్టగొడుగుల ఉత్పత్తి, పశువుల మేత, వర్మీకంపోస్ట్ తయారీ వంటి విధానాలలో వినియోగించి అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. పంట అవశేషాలను కాల్చివేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే పుట్టగొడుగుల సాగు మరియు వర్మీ కంపోస్టు తయారీ చేపట్టి గ్రామీణ యువత మహిళలు మంచి ఆదాయంపొందవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల నిఖిత ప్రశాంత్, ఏ ఈ ఓమునీరా బేగం,సహాయ ఆచార్యులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, పంచాయతీ కార్యదర్శిఎం.డి. రఫీ,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply