సీఎం రేవంత్‌రెడ్డికి వి. హనుమంతరావు విజ్ఞప్తి
స్వాతంత్ర్య సమరయోధురాలిగా, ప్రజాప్రతినిధిగా సంగం లక్ష్మీబాయి సేవలు చిరస్మరణీయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య సమరయోధురాలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఎంపీ సంగం లక్ష్మీబాయి సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారు వి. హనుమంతరావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కోరారు. చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి ‘సంగం లక్ష్మీబాయి స్టీల్ బ్రిడ్జి’గా నామకరణం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా సేవతో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో సంగం లక్ష్మీబాయి పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తూ ఆమె సేవలకు తగిన గౌరవం కల్పించాలని కోరారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర
సంగం లక్ష్మీబాయి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని హనుమంతరావు తెలిపారు. సత్యాగ్రహ ఉద్యమం, సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంతో పాటు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లోనూ ఆమె కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు. అనంతరం భూదాన్ ఉద్యమంలోనూ భాగస్వామ్యమై ప్రజా సమస్యల కోసం పోరాడారని గుర్తుచేశారు.
విద్యారంగానికి విశేష సేవలు
ప్రజా జీవితంతో పాటు విద్యారంగంలోనూ సంగం లక్ష్మీబాయి విశేష సేవలు అందించారని హనుమంతరావు తెలిపారు. సైదాబాద్‌లో ఇందిరా సేవాసదన్ను స్థాపించి పేద విద్యార్థినులకు విద్యావకాశాలు కల్పించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.
మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా వివిధ హోదాల్లో సేవలందించిన సంగం లక్ష్మీబాయి ప్రజా జీవితాన్ని స్మరించుకునేలా స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టడం సముచితమని వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి నామకరణానికి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
