ఇందిరమ్మ టవర్లకు సీఎం రేవంత్‌ శంకుస్థాపన

  • సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం..
  • భద్రతా ఏర్పాట్లలో 300 మంది పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఆగస్టు 13న సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబులను అతిథులుగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కార్యక్రమం కోసం సుమారు 300 మంది పోలీసులను మోహరించనున్నారు. బుధవారం వేదిక వద్ద బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలు, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.