అగ్నిమాపక వాహనానికి మొరాయింపు
బండి కాదు.. మొండి.. సాయం పట్టండి!
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో ఉన్న వాహనం మొరాయించడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కొందరిని పిలిపించి ఫైర్ ఇంజన్ను తోసి వాహనాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
అయినప్పటికీ ఎంతమంది ప్రయత్నించినా ఫైర్ ఇంజన్ స్టార్ట్ కాకపోవడంతో సిబ్బంది నిరాశకు గురయ్యారు. అగ్నిమాపక వాహనాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వాహనంలోని బ్యాటరీ కాలం చెల్లకముందే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు పేర్కొంటున్నారు. అగ్నిప్రమాదాలు ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉన్నందున అగ్నిమాపక వాహనాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అలాగే విధుల్లో యూనిఫాం ధరించాల్సిన అగ్నిమాపక సిబ్బంది కొందరు సివిల్ దుస్తుల్లో కనిపించడం కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అగ్నిమాపక వాహనాల నిర్వహణతో పాటు సిబ్బంది విధులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
