Gen Z Spending Habits: నెలవారీ ఖర్చుల్లో 70%కు పైగా అవసరాలకే.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: జెన్ జెడ్ ( Generation-Z ) ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం.. ఇది ఓ పదం కాదు.. ఇదో ఓ తరం.. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా మార్పులను తీసుకొస్తున్న తరాలలో జెన్ జెడ్ఒకటి. టెక్నాలజీ, సోషల్ మీడియా, కొత్త ఆలోచనలు, స్వేచ్ఛా భావాలు, వ్యక్తిగత గుర్తింపు వంటి అంశాలతో వీరి జీవనశైలి మునుపటి తరాల కంటే చాలా భిన్నంగా కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచే డిజిటల్ ప్రపంచంతో పెరిగిన ఈ తరం సమాచారాన్ని వేగంగా స్వీకరించడమే కాకుండా, సమాజం, విద్య, ఉద్యోగాలు, సంబంధాలు, జీవన విధానం వంటి అనేక విషయాలపై కొత్త దృక్పథాలను తీసుకొస్తోంది. అందుకే ప్రస్తుతం జెన్ జెడ్ (Gen Z) అనే పదం మన చుట్టూ చాలా ఎక్కువగా వినిపిస్తోంది.”

దేశ ఆర్థిక వ్యవస్థలో యువత పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా జెన్‌ జెడ్‌ తరం ఉద్యోగాల్లోకి వచ్చి సంపాదించడం మొదలుపెట్టడంతో.. వారి ఖర్చుల తీరు ఎలా ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది. జెన్‌ జెడ్‌ అంటే ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లపై ఎక్కువగా ఖర్చు చేసే తరం అనే అభిప్రాయం ఉంది. అయితే భారతదేశంలోని యువ ఉద్యోగుల ఖర్చులపై జరిగిన తాజా అధ్యయనం ఈ అభిప్రాయానికి భిన్నమైన విషయాలను వెల్లడించింది.

ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ శాలరీ సీ (SalarySe) నిర్వహించిన ఈ అధ్యయనంలో 5.2 లక్షలకు పైగా జీతం పొందుతున్న యూపీఐ వినియోగదారుల లావాదేవీలను విశ్లేషించారు. ఈ విశ్లేషణలో జెన్‌ జెడ్‌ తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని సరదా, ట్రావెల్‌ కోసం కాకుండా.. రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆహారం, ఆర్థిక అవసరాల కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది.

నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా అవసరాలకే..

జెన్‌ జెడ్‌ నెలవారీ ఖర్చులను పరిశీలించగా.. బిల్లులు, కిరాణా, రోజువారీ అవసరాలు, ఆర్థిక సేవలు, భోజనం వంటి వాటికే ఎక్కువ డబ్బు వెళ్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు – 20.1%, కిరాణా, రోజువారీ అవసరాలు – 15.7%, ఆర్థిక సేవలు – 12.2%, షాపింగ్ – 11.9%, ఇంట్లో లేదా బయట భోజనం – 11.5% ఈ కేటగిరీలన్నింటినీ కలిపి చూస్తే.. జెన్‌ జెడ్‌ నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా అవసరాల కోసమే వెళ్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

ట్రావెల్‌కు కేవలం 5 శాతం..

జెన్‌ జెడ్‌ గురించి మాట్లాడినప్పుడు ట్రావెల్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ట్రిప్స్, టూర్స్, వెకేషన్స్‌కు సంబంధించిన పోస్టులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, అధ్యయనంలో నమోదైన ఖర్చులను చూస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉంది.

జెన్‌ జెడ్‌ నెలవారీ మొత్తం ఖర్చులో ట్రావెల్, ఆఫీస్‌కు వెళ్లి రావడం వంటి వాటికి కలిపి కేవలం 5 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు విశ్లేషణలో తేలింది. అదే సమయంలో కిరాణా, ఆర్థిక సేవలు, భోజనం.. ఈ మూడు కేటగిరీలకే కలిపి 39.4 శాతం ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది.దీంతో సోషల్ మీడియాలో కనిపించే జెన్‌ జెడ్‌ ఇమేజ్‌ కంటే.. నిజ జీవితంలో వారి ఖర్చుల ప్రాధాన్యతలు చాలా భిన్నంగా ఉన్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

వయసు పెరిగే కొద్దీ ఆర్థిక బాధ్యతలు..

జెన్‌ జెడ్‌ వయసు పెరుగుతున్న కొద్దీ వారి ఖర్చుల్లో కూడా మార్పు కనిపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.18–23 ఏళ్ల వయసున్న వారిలో ఎమర్జెన్సీ అవసరాల కోసం సుమారు 50 శాతం కేటాయిస్తున్నట్లు విశ్లేషణలో తేలింది. అదే 24–29 ఏళ్ల వయసు వారిలో ఈ వాటా 59 శాతానికి పెరిగింది.

ఉద్యోగంలో స్థిరపడటం, ఈఎంఐలు, ఇన్సూరెన్స్, సేవింగ్స్ వంటి బాధ్యతలు పెరగడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే ఆర్థిక బాధ్యతలు పెరిగినా.. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో జెన్‌ జెడ్‌ పూర్తిగా వెనక్కి తగ్గడం లేదని అధ్యయనం తెలిపింది. వినోదం, విశ్రాంతి కోసం కూడా గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు విశ్లేషణలో వెల్లడైంది.

డిజిటల్ పేమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం..

జెన్‌ జెడ్‌ ఖర్చుల్లో మరో ముఖ్యమైన విషయం డిజిటల్ పేమెంట్స్ వినియోగం. కరెంట్, వాటర్ బిల్లుల నుంచి మొబైల్ రీచార్జ్‌లు, సబ్‌స్క్రిప్షన్లు, ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్లు, రోజువారీ కొనుగోళ్ల వరకు.. చాలా చెల్లింపులను యూపీఐ వంటి డిజిటల్ పేమెంట్ విధానాల ద్వారానే చేస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. దీంతో ఒకప్పుడు నగదు లేదా వేర్వేరు పేమెంట్ విధానాలతో జరిగే చిన్న చిన్న చెల్లింపులు కూడా ఇప్పుడు ఒకే డిజిటల్ విధానంలోకి వస్తున్నాయి.

మారుతున్నఆర్థిక ఆలోచన..

మొత్తంగా చూస్తే.. భారతీయ జెన్‌ జెడ్‌ను కేవలం ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ లైఫ్‌స్టైల్‌కు ఎక్కువగా ఖర్చు చేసే తరంగా చూడటం పూర్తిగా సరైనది కాదని ఈ అధ్యయనం సూచిస్తోంది. బిల్లులు, రోజువారీ అవసరాలు, ఈఎంఐలు, ఇన్సూరెన్స్, సేవింగ్స్ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూనే.. తమకు నచ్చిన షాపింగ్, ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అంటే.. “సంపాదించాలి.. అవసరాలకు ఖర్చు చేయాలి.. భవిష్యత్తు కోసం దాచుకోవాలి.. అదే సమయంలో లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయాలి” అనే విధంగా జెన్‌ జెడ్‌ తమ డబ్బును బ్యాలెన్స్ చేసుకుంటున్నట్లు ఈ అధ్యయనం ద్వారా అర్థమవుతోంది.

సోషల్ మీడియాలో కనిపించే ట్రావెల్, ఫన్, డిజిటల్ లైఫ్‌స్టైల్‌ కంటే.. జెన్‌ జెడ్‌ నిజ జీవితంలో ఆర్థిక బాధ్యతలకు కూడా పెద్దపీట వేస్తున్నట్లు ఈ విశ్లేషణ వెల్లడించింది.