ఢిల్లీ ఎర్రకోట పేలుడు.. అల్‌ఖైదా కుట్ర..

  • యూఎన్ నివేదికలో కీలక విష‌యాలు

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గత నవంబర్‌లో జరిగిన భయంకరమైన ఆత్మాహుతి కారు బాంబు దాడికి, అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన ‘అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (AQIS) కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన ఉగ్రవాద వ్యతిరేక పర్యవేక్షణ బృందం పేర్కొంది. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏక్యూఐఎస్‌ గతంలో మాదిరిగా ఒకే పెద్ద ఉగ్రవాద సంస్థగా కాకుండా.. స్వతంత్రంగా పనిచేసే చిన్న చిన్న విభాగాలుగా (సెల్స్) విస్తరిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ప్రాంతీయ స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు రవాణా, ఆర్థిక సహకార వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటోందని తెలిపింది. బంగ్లాదేశ్‌ను వేదికగా చేసుకుని అక్కడ తమ ఉగ్రవాద విభాగాలను ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోందని పర్యవేక్షక బృందం ప్రత్యేకంగా హెచ్చరించింది.

దక్షిణాసియాలో ఉగ్రవాద ముప్పు మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌జవాహిరీ 2014లో అల్‌ఖైదా ఇన్‌ ద ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌ను ఏర్పాటు చేశాడు. భారత ఉపఖండంలో అల్‌ఖైదా కార్యకలాపాలను విస్తరించడమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు పేర్కొంటున్నాయి.

ఎర్రకోట పేలుడుపై గతంలో వచ్చిన ఐక్యరాజ్యసమితి నివేదికలో జైషే మహ్మద్‌ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఫిబ్రవరిలో విడుదలైన ఆ నివేదికలో ఎర్రకోట దాడితో జైషే మహ్మద్‌కు సంబంధం ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. తాజాగా విడుదలైన నివేదిక మాత్రం దాడిని నేరుగా ఏక్యూఐఎస్‌కు ఆపాదించడం గమనార్హం. జైషే మహ్మద్‌కు అల్‌ఖైదాతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా భద్రతా మండలి పర్యవేక్షణ బృందం పేర్కొంది.

న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విశ్లేషణ, మద్దతు, ఆంక్షల పర్యవేక్షణ బృందంలో పది మంది నిపుణులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు, వాటి అనుబంధ సంస్థల కార్యకలాపాలను ఈ బృందం పరిశీలిస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించే విషయంలో భద్రతా మండలి సంబంధిత కమిటీలకు ఈ బృందం నివేదికలు, సమాచారాన్ని అందిస్తుంది.

ఎర్రకోట పేలుడు వెనుక ఏక్యూఐఎస్‌ పాత్ర ఉందని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణ బృందం తాజా నివేదికలో పేర్కొనడం దక్షిణాసియాలో పెరుగుతున్న ఉగ్రవాద ముప్పుపై మరోసారి దృష్టిని కేంద్రీకరించింది.