స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి
మునుగోడు, ఆంధ్రప్రభ : పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని, కాలుష్యాన్ని అరికట్టాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ నల్లగొండ 15వ జిల్లా ప్రతినిధుల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ, విద్య, ఉపాధి సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శించారు. యువత ఓటు వేసే వయసుకే పరిమితం కాకుండా దేశ రాజకీయాలను మార్చే శక్తిగా ఎదగాలని సూచించారు.మునుగోడు నియోజకవర్గంలో రసాయన పరిశ్రమలు పెరుగుతున్నా స్థానిక యువతకు తగిన ఉద్యోగాలు దక్కడం లేదని సత్యం అన్నారు. పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
స్థానికులకు ఉద్యోగాలు, కాలుష్య నియంత్రణ డిమాండ్లతో త్వరలో ‘చలో దివిస్’ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. నీట్ సహా పోటీ పరీక్షల్లో పారదర్శకత పాటించాలని, ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టాలని కోరారు. రాష్ట్రంలోని ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. అంజాచారి,నల్లపురాజు రామలింగయ్య, మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్, నల్పరాజు సతీష్‌కుమార్, బీమనపల్లి రమేష్, బుర్ర శేఖర్, జిల్లా యాదగిరి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు బి. జగన్, జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగారావు, బి. లాలయ్య, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎనమల్ల నవీన్, ఎషమోని మల్లేష్, పగిళ్ల రమేష్,కట్ట దశరథ, కట్కూరి లింగస్వామి, గొపగోని ఉదయ్,మాదగోని అశోక్, తదితరులు పాల్గొన్నారు.
