హంద్రీనీవా కాలువలో కౌలు రైతు గల్లంతు
- విద్యుత్ వైరు కనెక్షన్ కోసం కాలువలోకి దిగిన రైతు
- పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: హంద్రీనీవా కాలువలో పడి ఓ కౌలు రైతు గల్లంతైన ఘటన గురువారం ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండ పట్టణంలోని పాతపేటకు చెందిన కౌలు రైతు ఎల్లప్ప లత్తవరం సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లాడు.
ఎల్లప్ప ఐదెకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాడు. వ్యవసాయ మోటారుకు విద్యుత్ వైరు కనెక్షన్ ఇచ్చేందుకు కాలువలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న వెంటనే ఉరవకొండ సీఐ మహానంది ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు, తోటి రైతులతో కలిసి పోలీసులు కాలువలో ఎల్లప్ప కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
