సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు
ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మహిళపై లైంగిక ఆరోపణలకు సంబంధించి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పష్టత ఇచ్చారు. రేగా కాంతారావును హైదరాబాద్ నగర పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆమె తెలిపారు.
ప్రస్తుతం రేగా కాంతారావుపై నమోదైన కేసు విచారణలో ఉందని, అయితే ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయలేదని డీసీపీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆయన అరెస్ట్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి ఉన్నా పోలీసులే అధికారికంగా వివరాలు వెల్లడిస్తారని డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. నిర్ధారణ లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ఆమె సూచించారు.

శిల్పవల్లి, ఖైరతాబాద్ జోన్ డిసిపి
