10.63 ఎకరాల వేలంని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌

సర్వే నంబర్‌ 83/1పై హక్కులు, న్యాయ వివాదాలు తేలకముందే వేలం ఎలా?

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాయదుర్గ్‌ నాలెడ్జ్‌ సిటీలోని ప్రభుత్వ భూముల వేలం వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబర్‌ 83/1లోని 10.63 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఈ నెల 17, 21 తేదీల్లో వేలం వేయనున్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ మాజీ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హ‌రీశ్ బహిరంగ లేఖ రాశారు.

భూమిపై యాజమాన్య హక్కులు, న్యాయపరమైన వివాదాలు పూర్తిగా పరిష్కారం కాకముందే వేలం నిర్వహించడం వల్ల భవిష్యత్తులో మూడో పక్ష హక్కులు ఏర్పడే అవకాశం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల భూమి హక్కులు, చట్టపరమైన స్థితిపై స్పష్టత వచ్చే వరకు వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.

వారసత్వ పరిరక్షణ అంశం తెరపైకి..

రాయదుర్గ్‌ సర్వే నంబర్‌ 83 ప్రాంతానికి సంబంధించిన వారసత్వ పరిరక్షణ అంశాలను కూడా మాజీ మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ఈ ప్రాంతంలోని ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు, సహజ వారసత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ కమిటీ సమావేశాల్లోనూ సర్వే నంబర్‌ 83 ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పరిరక్షణ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఈ ప్రాంతంలోని ప్రతి భూమి ముక్కకు ఒకే విధమైన వారసత్వ హోదా ఉందా? ప్రస్తుతం ప్రతిపాదించిన 10.63 ఎకరాల భూమికి సంబంధించి ఏయే పరిరక్షణ నిబంధనలు వర్తిస్తాయి? అనే అంశాలపై అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

ఎస్‌బీఐతోనూ భూమి వివాదం

సర్వే నంబర్‌ 83/1లోని భూములపై గతంలోనే యాజమాన్య, కేటాయింపు వివాదాలు తలెత్తాయి. ఈ సర్వే నంబర్‌లోని ఐదు ఎకరాల భూమిని తమకు గతంలో కేటాయించారని పేర్కొంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూమికి సంబంధించిన వేలం ప్రక్రియపై 2026 జూన్‌లో హైకోర్టు మధ్యంతరంగా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్‌బీఐ వాదన ప్రకారం.. అప్పటి రాష్ట్ర బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కు 2010లో ఐదు ఎకరాల భూమి కేటాయించగా, తర్వాత బ్యాంకుల విలీనంతో అది ఎస్‌బీఐ పరిధిలోకి వచ్చింది. భూమిపై తాము పెట్టుబడి పెట్టి, అక్కడ శాఖ, ఏటీఎంలు ఏర్పాటు చేశామని బ్యాంకు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం మాత్రం నిర్ణీత గడువులో ప్రాజెక్టు పూర్తి చేయలేదని వాదించింది. ఈ వివాదంపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.

వక్ఫ్‌ హక్కులపై కూడా అభ్యంతరాలు

ఇదే సర్వే నంబర్‌ 83/1లోని కొన్ని భూములపై వక్ఫ్‌ హక్కులకు సంబంధించిన అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. జామియా నిజామియా సంస్థ ఈ భూమిలో కొంత భాగం వక్ఫ్‌ ఆస్తిగా నమోదు అయిందని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదికలు వెలువడ్డాయి. యూఎంఈడీ వేదికలోనూ సంబంధిత భూమికి వక్ఫ్‌ ఆస్తిగా నమోదు ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీంతో సర్వే నంబర్‌ 83/1లోని మొత్తం భూములపై హక్కులు, కేటాయింపులు, న్యాయపరమైన స్థితి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి కోరారు.

ప్రతిపక్షంలో ఒక వైఖరి.. అధికారంలో మరో వైఖరా?

రాయదుర్గ్‌ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకున్న వైఖరిని కూడా బహిరంగ లేఖలో ప్రస్తావించారు. 2020లో అప్పటి కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి రాయదుర్గ్‌లోని 31.35 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ సంస్థలకు బదలాయించడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములపై మూడో పక్ష హక్కులు ఏర్పడకుండా స్థితిగతులను కొనసాగించాలని ఆయన అప్పట్లో కోరారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి హయాంలోనే రాయదుర్గ్‌లోని వివాదాస్పద భూముల వేలం కొనసాగడం ఎలా సమర్థనీయమని లేఖలో ప్రశ్నించారు. “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వైఖరి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో వైఖరా?” అంటూ ప్రశ్నించారు.

భూములపై స్పష్టత వచ్చే వరకు వేలం ఆపాలి

రాయదుర్గ్‌ భూముల విషయంలో ఎస్‌బీఐ అభ్యంతరాలు, వక్ఫ్‌ హక్కుల వాదనలు, గత కేటాయింపులు, న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని మాజీ మంత్రి కోరారు. భూమి యాజమాన్య హక్కులు, వర్గీకరణ, న్యాయపరమైన స్థితి, వారసత్వ పరిరక్షణ అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే ప్రభుత్వం వేలం వంటి చర్యలకు వెళ్లాలని సూచించారు. వివాదాలు పరిష్కారం కాకముందే వేలం నిర్వహిస్తే కొత్తగా మూడో పక్ష హక్కులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రాయదుర్గ్‌ ప్రాంతంలోని విలువైన భూములు కేవలం ప్రభుత్వ ఆదాయ వనరులుగా కాకుండా నగర భవిష్యత్తు, పర్యావరణం, వారసత్వ పరిరక్షణకు సంబంధించిన ఆస్తులుగా చూడాలని కోరారు. ఆగస్టు 17, 21 తేదీల్లో ప్రతిపాదించిన 10.63 ఎకరాల వేలాన్ని వెంటనే నిలిపివేసి.. భూమి హక్కులు, న్యాయ వివాదాలపై తుది స్పష్టత వచ్చే వరకు ఎలాంటి మూడో పక్ష హక్కులు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు.