మేడారం ఆలయ తుది దశ అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
సమ్మక్క–సారలమ్మ సన్నిధి నుంచి ఒంటరి, వితంతు మహిళల పింఛన్లకు శ్రీకారం.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం ప్రాంతాన్ని ముస్తాబు చేయాలని, ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, సమ్మక్క–సారలమ్మ సన్నిధి నుంచి ఒంటరి, వితంతు మహిళల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గురువారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పో లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు మేడారం ప్రాంగణానికి వచ్చి సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు మహాజాతరకు ముందు కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సహచరులతో కలిసి మేడారంలో బస చేసి, ములుగు జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించారని తెలిపారు.
ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి మరోసారి మేడారానికి వస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి, భవిష్యత్తులో చేపట్టాల్సిన విస్తరణ, అభివృద్ధి పనులపై సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇవ్వనున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, మార్గదర్శకత్వానికి అనుగుణంగా మేడారాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మేడారానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ములుగు జిల్లా, నియోజకవర్గ ప్రజల తరఫున పేరుపేరునా స్వాగతం పలుకుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి మేడారం ఆలయ ప్రాంగణంలో పర్యటించనున్న నేపథ్యంలో భక్తులు, స్థానిక ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం సమ్మక్క–సారలమ్మ సన్నిధి నుంచి అర్హులైన ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్లు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించాలనే లక్ష్యంతో సంతృప్తి స్థాయిలో పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి, అర్హులను గుర్తించి పింఛన్లు అందించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ తల్లుల దీవెనలతో ప్రతి మహిళ సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో
ఈ కార్యక్రమాన్ని వారి సన్నిధి నుంచే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం ఏ.ఎస్.పి మనన్ భట్, జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, మేడారం సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, నార్లపూర్ సర్పంచ్ తొలె ఓ కృష్ణ,గుత్తేదారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
