కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

  • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు.. నేషనల్ టార్చర్ ఏజెన్సీ
  • ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఎన్‌టీఏ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ లక్ష్మణ్ కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వరుస వైఫల్యాలు, నీట్ పరీక్ష పేపర్ లీక్, యూజీసీ-నెట్ దరఖాస్తుల నిర్వహణలో జరిగిన అవకతవకలు, సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాంకనంలో లోపాలు, సీయూఈటీ-యూజీ పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేయడం వంటి ఘటనలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలన్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు కే.క్రాంతికుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో ఉన్నత విద్య ప్రవేశాలు, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్‌టీఏ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా నీట్, యూజీసీ-నెట్, సీయూఈటీ వంటి పరీక్షల నిర్వహణలో వరుసగా లోపాలు బయటపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు చేపట్టకుండా విద్యార్థులను అయోమయానికి గురి చేస్తోందన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించిందని, అయినప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూజీసీ-నెట్ దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతిక సమస్యలు, పరీక్షల నిర్వహణలో గందరగోళం, సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో వచ్చిన ఫిర్యాదులు, సీయూఈటీ-యూజీ పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేయడం వంటి చర్యలు విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు.

విద్యను హక్కుగా కాకుండా నిర్లక్ష్యంగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే ఎన్‌టీఏ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని, వైఫల్యాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కె. రోహిత్ ,బి. సింధు, పి. సాయి కృష్ణ, ఎన్. సాయిఫణికుమార్,తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply