UK Support for Amaravati | సుస్థిర మౌలిక సదుపాయాలపై యూకేతో కీలక చర్చలు

UK Support for Amaravati | సుస్థిర మౌలిక సదుపాయాలపై యూకేతో కీలక చర్చలు

UK Support for Amaravati | అమరావతిలో యూకే ప్రతినిధి బృందం పర్యటన
గ్రీన్ మొబిలిటీ, స్మార్ట్ టెక్నాలజీలపై ఫోకస్
పీపీపీ మోడల్‌తో పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు
ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి అభివృద్ధి లక్ష్యం

UK Support for Amaravati | అమరావతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: పట్టణాల అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే)తో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి చర్చలు ప్రారంభించింది. గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణ, ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకునే లక్ష్యంగా గురువారం యూకే ప్రతినిధి బృందం, ఉన్నతాధికారుల మధ్య కీలక సమావేశం జరిగింది.

యూకే డిపార్టుమెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ పార్టనర్‌షిప్ డైరెక్టర్ చాజ్వాలియా, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ (హైదరాబాద్) డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తదితర నిపుణులతో జరిగిన ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్, ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారధి, సీఆర్డీఏ అదనపు కమిషనర్లు హాజరయ్యారు.

ఇంధన ఉత్పత్తి, ప్రసరణ రంగాల్లో సహకారం, గ్రీన్ మొబిలిటీ, సుస్థిర పట్టణ రవాణా వ్యవస్థలు, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాలపై చర్చించారు. పట్టణాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్లు, ఇతర టెక్నాలజీలు, పరికరాలపై చర్చించారు. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

యూకే ప్రతినిధి బృందం ఎక్స్చేంజ్ ఫైనాన్స్‌తో సహా పలు ఫండింగ్ విధానాలను వివరించగా, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) మోడల్ ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలను ప్రస్తావించారు. సుస్థిర ప్రాజెక్టులపై దృష్టిపెట్టి, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉందని ఉన్నతాధికారులు వివరించారు. ప్రపంచ భాగస్వామ్యాలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాల మార్పిడి ద్వారా సంస్థాగత సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి.

ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ, సుస్థిర పట్టణాభివృద్ధి కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, సేవల నాణ్యత పెంపు కోసం ఇటువంటి భాగస్వామ్యాలు కీలకమన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు కార్యరూపం దాల్చేందుకు త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

అనంతరం బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి బృందం రాజధాని అమరావతిలో పర్యటించింది. అమరావతిని సుస్థిర, సమగ్రమైన, ప్రపంచస్థాయి ప్రజారాజధానిగా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న కార్యాచరణ, ప్రణాళికను సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు వివరించారు. అనంతరం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లు, గ్రావిటీ కెనాల్, క్యాంప్ సైట్ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

సీఆర్డీఏ అధికారులు టవర్ల నిర్మాణ పురోగతి, నిర్మాణంలోని విశిష్ట విధానాల గురించి, ప్రణాళికాయుతంగా అమరావతిలో అనుసరిస్తున్న పర్యావరణ అనుకూల విధానాల గురించి వివరించారు. అనంతరం సీఆర్డీఏ కార్యాలయంలో అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్) ఎండీ శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి డిప్యూటీ హైకమిషనర్ వివరించారు. రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రణాళికలు, విద్యా, వైద్య, పర్యాటక తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇప్పటికే ప్రముఖ విద్యా, వైద్య సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు.

Leave a Reply