Smart City Projects AP | ఏపీ పట్టణాలకు కొత్త ఊపు

Smart City Projects AP | ఏపీ పట్టణాలకు కొత్త ఊపు
Smart City Projects AP | విశాఖ, మంగళగిరిలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు
స్మార్ట్ వాటర్ సప్లై, డ్రైనేజీ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
పట్టణాభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్
రూ.1990 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం
మున్సిపల్ బాండ్లతో పట్టణాభివృద్ధికి కొత్త దిశ
Smart City Projects AP | అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : పట్టణాల అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్గా రాష్ట్రాన్ని నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. స్మార్ట్ నగరాలతో పాటు పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన .. నవీనీకరణకు ప్రణాళికలను అమలు చేస్తోంది.. కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంటులను అందిపుచ్చుకుని స్వచ్చమైన సుందర నగరాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 1990.83 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద నాలుగు కీలక ప్రాజెక్టులకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది.
ఈ ఫండ్ ద్వారా మొత్తం 497.71 కోట్ల కేంద్ర సాయం మంజూరు కానుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పట్టణీకరణ విస్తరణతో స్వీయ ఆర్థిక సంవృద్ధితో జీవన నగరాలు, పట్టణాల అభివృద్ధికి ఇప్పటికే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దీంతో పురపాలకశాఖ ఆధునిక పట్టణాభివృద్ధిపై ఫోకస్ పెంచింది. తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మురుగు నీటి శుద్ధిపై ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించింది.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖ, మంగళగిరి-తాడేపల్లిలో ప్రజారోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. పట్టణాల్లో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగా పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ అవకాశాన్ని రాష్ట్రం పూర్తిస్థాయిలో వినియోగించుకోవటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలను పురపాలకశాఖ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన పైపులైన్ల ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలో వాటిని జాతీయ స్థాయి అపెక్స్ కమిటీ ముందుంచనున్నారు.
దీనికితోడు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోగా మున్సిపల్ బాండ్ల ద్వారా వెయ్యి కోట్ల ఆదాయానికి లక్ష్యాలను నిర్దేశించుకుంది. అర్బన్ చాలెంజ్ ఫండ్‌తో విశాఖపట్నం, మంగళగిరి-తాడేపల్లిలో రూ.497.71 కోట్ల కేంద్ర సహాయంతో నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అయింది. పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఫైనాన్స్, గ్రీన్ బాండ్లు, యూసీఎఫ్‌లను వినియోగించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అజెండాకు భారీ ఊతమిస్తూ, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరియు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రాష్ట్రం సమర్పించిన నాలుగు ప్రాజెక్టులకు భారత ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం లభించటం పట్ల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
గృహ, అటవీ మంత్రిత్వ శాఖ జాతీయ అపెక్స్ కమిటీ, మొదటి దశ కింద రూ.1,990.83 కోట్ల అంచనా ప్రాజెక్ట్ వ్యయంతో నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను ఆమోదించటంతో పాటు రూ.497.71 కోట్ల కేంద్ర సహాయాన్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్టులలో 24×7 నిరంతరాయంగా స్మార్ట్ నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి, బల్క్ వాటర్ సిస్టమ్ ఆధునీకరణ, స్మార్ట్ మీటరింగ్, స్కాడా ఆధారిత పర్యవేక్షణ, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం మరియు సాంకేతికత ఆధారిత మునిసిపల్ సేవల పంపిణీ పనులు చేపడతారు.
విశాఖపట్నంలో మధురవాడ జోన్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి యూసీఎఫ్ కింద కేంద్ర సహాయం 606.78 కోట్లకు గాను 25 శాతం అంటే 151.70 కోట్లు, నిరంతర స్మార్ట్ నీటి సరఫరా అభివృద్ధి వ్యవస్థకు జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్‌లో 689.49 కోట్లకు గాను 172.37 కోట్లు, విశాఖలో బల్క్, సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థ పునరుద్ధరణ, ఆధునీకరణకు 110.46 కోట్లకు గాను 27.62 కోట్లు, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ పనుల్లో భాగంగా హాం పద్ధతిన 584.10 కోట్ల అంచనాకు గాను 146.03 కోట్లు వెరసి 1990.83 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపగా తొలివిడత 497.71 కోట్లు కేంద్రం మంజూరు చేసింది.
పట్టణ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌ను సాంప్రదాయ గ్రాంట్-ఆధారిత నమూనాల నుండి సంస్కరణ-అనుసంధాన, మార్కెట్-ఆధారిత మరియు ఫలిత-ఆధారిత పెట్టుబడుల వైపు మళ్లించడానికి రూపొందించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ ముందస్తు సన్నద్ధతకు ఈ ఆమోదం ఒక ప్రధాన భూమిక కానుంది. కాగా ఇప్పటి వరకు రాష్ట్రం రూ.14,400 కోట్ల వరకు ప్రాజెక్టులను రూపొందించడానికి వీలు కల్పిస్తూ, అందులో కనీసం రూ.7,200 కోట్లను ప్రైవేట్ భాగస్వామ్యాలతో సహా మార్కెట్ వనరుల ద్వారా సమీకరించాలని నిర్ణయించింది.
ఇందుకు అనుగుణంగా, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద సాధ్యమైనంత ఎక్కువ సహకారం పొందేందుకు ప్రభుత్వం సుమారు రూ.15,000 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నీటి భద్రత, మురుగునీటి పారుదల, పారిశుధ్యం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, రవాణా, పురపాలక రెవెన్యూ సంస్కరణలు, పీపీపీ నమూనాలు, హరిత మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలు ప్రామాణికంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కలిసి ప్రజారోగ్యం, పర్యావరణ నిబంధనల పాటింపు, నీటి భద్రత, పారిశుధ్య కవరేజ్, పట్టణ జీవన సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని అంచనా.
మున్సిపల్ బాండ్లు అనేవి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం మూలధన మార్కెట్ నుండి నిధులను సమీకరించడానికి పట్టణ స్థానిక సంస్థలు లేదా సమీకృత మున్సిపల్ ఆర్థిక నిర్మాణాలచే జారీ చేయబడిన రుణ పత్రాలు. ఇవి నగరాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, రోడ్లు, డ్రైనేజీ, వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, ఇతర పౌర మౌలిక సదుపాయాల కోసం దీర్ఘకాలిక వనరులను సమీకరించుకోవడానికి వీలు కల్పిస్తాయి. అదే సమయంలో, ఇవి పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణ, క్రెడిట్ రేటింగ్, రాబడిని ప్రత్యేకంగా కేటాయించడం, ఆడిట్ చేయబడిన ఖాతాలు, ఎస్క్రో యంత్రాంగాలు మరియు మెరుగైన పురపాలనను ప్రోత్సహిస్తాయి.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్. సురేష్ కుమార్, ఐఏఎస్ మాట్లాడుతూ, సంస్కరణలతో అనుసంధానించబడిన మరియు మార్కెట్-ఫైనాన్స్ మద్దతుగల పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సిద్ధం చేయడంలో ఆంధ్రప్రదేశ్ సంసిద్ధతను ప్రదర్శించిందని అన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కేవలం ఒక గ్రాంటు పథకం మాత్రమే కాదు. ఇది సంస్కరణలతో ముడిపడిన ఒక ఆర్థిక వేదిక. బ్యాంకుల నుండి రుణాలు పొందగల ప్రాజెక్టులు, ఎస్క్రో ఆధారిత నగదు ప్రవాహాలు, మార్కెట్ రుణాలు, పీపీపీ నిర్మాణాలు, వినియోగదారుల ఛార్జీల సంస్కరణలు, డిజిటల్ పర్యవేక్షణ మరియు కొలవగల సేవా ఫలితాల పరంగా ఆలోచించాలని ఇది పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్బీలను) కోరారు.
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో, 2026 ఆగస్టు 30 నాటికి రూ.1,000 కోట్ల మున్సిపల్ బాండ్ల జారీ దిశగా అడుగులు వేస్తోందని సురేష్ కుమార్ తెలిపారు. సుస్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల మౌలిక సదుపాయాలలోకి పెట్టుబడులను మళ్లించడానికి జీవీఎంసీ ప్రతిపాదించిన గ్రీన్ బాండ్ మార్గం సహాయపడుతుందన్నారు.
మురుగునీటి శుద్ధి, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం, శక్తి సామర్థ్యం గల పంపింగ్, స్మార్ట్ నీటి సరఫరా, రాబడి లేని నీటి తగ్గింపు, పర్యావరణ బాధ్యతాయుతమైన పట్టణ మౌలిక సదుపాయాల వంటి ప్రాజెక్టులకు గ్రీన్ బాండ్లు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. యూసీఎఫ్ కింద తాత్కాలికంగా కేటాయించిన రూ.3,600 కోట్ల నిధులు, రూ.14,400 కోట్ల వరకు ప్రాజెక్టులను రూపొందించే అవకాశం ఉండటంతో, ప్రధాన పట్టణ కేంద్రాలలో కీలక మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడానికి ఈ నిధులను వినియోగించుకోవడానికి సిద్ధమవుతోంది.
