- అగ్ని ప్రమాద బాధితుకులకు అండగా ఉంటాం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- క్షతగాత్రులకు ఓదార్పు.. సంఘటనపై ఆరా
- మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : చార్మినార్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. సోమవారం క్షతగాత్రులను పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కేటీఆర్ ముందు కన్నీరు పెట్టుకోగా వారిని ఓదార్చారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో బాధితులు సర్వం కోల్పోయారని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ.. ఐదు లక్షలు కాకుండా రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని, అవి వారి ఇంటిని, వ్యాపారాన్ని పున:నిర్మించుకోవడానికి ఉపయోగ పడుతాయని అన్నారు.
అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైర్ ఇంజన్ లో నీళ్లు ఉంటే గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేదని అభిప్రాయపడ్డరు. . ఫైర్ బ్రిగేడ్ కు సరైన మాస్కులు లేకపోవడంలో వాళ్లు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారన్నారు.. అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ, ఇలాంటి మౌలిక సదుపాయల కల్పనపై పెడితే బాగుంటుందని అన్నారు.. 125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమని పేర్కొన్నారు.

కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే –
♦️ నిన్నటి గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరం. గుల్జార్ హౌస్ గురించి తెలియని వాళ్లు హైదరాబాద్, తెలంగాణలో ఎవరూ లేరు.
♦️ 125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలోని 17 మంది చనిపోవడం మనసున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసింది.
♦️ బాధిత కుటుంబసభ్యులు ఎవరినీ నిందించడం లేదు. కాని వారు కొన్ని విషయాలు చెప్పారు.
♦️ ఫైర్ బ్రిగేడు నీళ్లు లేకుండా వచ్చింది. ఫైర్ బ్రిగేడ్ వాళ్లు సరైన మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారు. అంబులెన్స్ లలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడం దారుణం.
♦️ ఈ కనీస సదుపాయలు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతికేవని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు.
♦️ అగ్నిప్రమాదం జరగగానే స్థానికులైన హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని కాపాడారని చెప్పారు.
♦️ మాకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఎవరు చనిపోకుండా చూడమని కోరారు.
♦️ నేను రాజకీయం చేయడానికి రాలేదు. ఎవరినీ విమర్శించడం లేదు. కాని ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టుకోవాలి.
♦️ పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశం. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లు రావడానికి కూడా వీలుకాలేదు.
♦️ అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలి. తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. ఇవేవి జరగలేదు. ఇది మంచిది కాదు. అంబులెన్స్ లు వచ్చినయి కాని అందులో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడంతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ఎనిమిది మంది చిన్నారులు తమ కళ్లముందే చనిపోయారని చెపుతున్నారు.
♦️ ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడండి.
♦️ అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటిపై కూడా పెట్టండి. అందాల పోటీలపై పెట్టే ఖర్చు ఇలాంటి సందర్భాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలపై పెట్టండి.
♦️ రేవంత్ రెడ్డి దగ్గరనే హోం, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. సంఘటన స్థలం దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తే బాగుండేది.
♦️ ఐదు లక్షల నష్టపరిహారం సరిపోదు. ఇంటికి, వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగింది. 125 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న అగర్వాల్ కుటుంబం మళ్లీ తమ వ్యాపారం ప్రారంభించుకోడానికి ప్రభుత్వం సహకరించాలి.
♦️ రూ. 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
♦️ బీఆర్ఎస్ తరపున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాము. రాజకీయం చేయడానికి రాలేదు. ఇలాంటి కడుపు కోత ఇంకెవరికి రాకూడదని వచ్చాను.
♦️ ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని కోరుతున్నాను.