29thMayeditorial | ఇరాన్ యుద్ధంపై ప్రపంచ దేశాల్లో ఆందోళన

29thMayeditorial | ఇరాన్ యుద్ధంపై ప్రపంచ దేశాల్లో ఆందోళన

29thMayeditorial | హార్మోజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు
యురేనియం వివాదంపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు
అబ్రహాం ఒప్పందాలపై ట్రంప్ కొత్త మెలిక
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు

29thMayeditorial | ఇరాన్ యుద్ధాన్ని అంతం చేసేందుకు ఒప్పందానికి చేరువలో అమెరికా, ఇరాన్‌ల చర్చలు సాగుతున్నాయంటూ వచ్చిన వార్తలు ప్రపంచంలోని అన్ని దేశాలనూ సంతోషపర్చాయి. ఇరాన్ యుద్ధం వల్ల ఈ దేశాలన్నీ భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా, చమురు సంక్షోభం వల్ల వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు పడుతున్న ఇక్కట్లు చెప్పనలవి కాదు. అమెరికా మాట మీద నిలబడకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం అని ఇరాన్ ఆరోపిస్తోంది.

అమెరికా హార్మోజ్ జలసంధి సమీపంలో దాడులను నిర్వహించింది. ఇరాన్ దళాల దాడుల నుంచి స్వీయరక్షణ కోసమే తమ దళాలు దాడులకు దిగినట్టు అమెరికా చెబుతోంది. ఒప్పందానికి చేరువలో ఉన్నామని ప్రకటన చేసిన అమెరికాయే ఈ మాట అనడంతో అమెరికా ప్రకటనల్లోని విశ్వసనీయత ప్రశ్నార్థకంగా తయారైంది.

తీరంలో ఉన్న క్షిపణి స్థావరాలు, తమ దేశానికి చెందిన విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలకు ముప్పుగా పరిణమించడం వల్లనే ఇరాన్ స్థావరాలపై దాడులకు తమ సేనలు ఉపక్రమించినట్టు అమెరికా చెబుతోంది. అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, అమెరికా ప్రకటనలన్నీ వట్టి బూటకాలేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇరాన్ తన వద్ద యురేనియం నిల్వలను తమ దేశానికి అప్పగించాలన్న అమెరికా డిమాండ్ న్యాయసమ్మతంగా లేదనీ, ఇజ్రాయెల్ ఇంకా అమెరికా మిత్రదేశాల వద్ద ఉన్న యురేనియంను కూడా ఇదే విధంగా అమెరికా డిమాండ్ చేస్తుందా? అని ఇరాన్ ప్రశ్నిస్తోంది.

అమెరికా దాడిలో బందర్ అబ్బాస్ నౌకాదళ స్థావరం ధ్వంసం అయినట్టు, తమ సైనికులు నలుగురు మరణించినట్టు ఇరాన్ చెబుతోంది. యురేనియంను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించినట్టు అమెరికన్ మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పాశ్చాత్య మీడియాలో అధిక భాగం అమెరికాకు అనుకూలంగా వార్తలను సృష్టిస్తోందని ఇరాన్ ఆరోపించింది.

మరోవైపు ఇజ్రాయెల్-లెబనాన్‌ల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల సేనలు దాడులకు సిద్ధపడటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పశ్చిమాసియా ప్రాంతం ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కవచంగా ఉండబోదని ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్జబా ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు.

అమెరికా, ఇజ్రాయెల్‌లు విరుచుకుపడుతుంటే తమ సేనలు చూస్తూ ఊరుకోవని ఆయన కూడా హెచ్చరించారు. అమెరికాకి చెందిన రీపర్ ఎంక్యూ-9 డ్రోన్‌ను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌తో చర్చల్లో పాల్గొంటున్న దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలని ట్రంప్ మెలిక పెట్టారు. ఇది జరిగే పని కాదని ఆయనకు తెలుసు. అబ్రహాం ఒప్పందాలను విస్తరించేందుకు ఇరాన్ తదితర దేశాలు వ్యతిరేకం అని ట్రంప్‌కు తెలుసు. అంటే, ఒప్పందానికి తాము సిద్ధమేనని చెబుతూ, అలవి కాని మెలికలు పెడుతుండటంతో ట్రంప్ ఉద్దేశ్యపూర్వకంగానే ఒప్పందానికి మోకాలడ్డుతున్నారని ఇరాన్ ఆరోపిస్తోంది.

ఇరాన్‌ను ఏదో విధంగా దెబ్బతీయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు పలకడం ట్రంప్‌కు ఇష్టం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. బందర్ అబ్బాస్ పోర్టు వద్ద వినిపించిన శబ్దాలు అమెరికా జరిపిన దాడులేననీ, ఇవి ముమ్మాటికీ దురాక్రమణ దాడులేనని ఇరాన్ రివల్యూషనరీ గార్డు కోర్ ఆరోపించింది. అమెరికా పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

Leave a Reply