Siddaramaiah | డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పిగా మారిన సర్వే

Siddaramaiah | డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పిగా మారిన సర్వే
Siddaramaiah | ఆధిపత్య కులాల్లో పెరుగుతున్న అసంతృప్తి
కాంగ్రెస్ హైకమాండ్‌కు సిద్ధరామయ్య సంకేతాలు
రాహుల్ గాంధీకి కులగణన ఎందుకు పెద్ద పరీక్ష?
చివరి రాజకీయ ఎత్తుగడతో క్లిష్ట పరిస్థితి
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సిద్ధరామయ్య గురువారం అధికారికంగా సంకేతాలు ఇచ్చారు. బెంగళూరులో కేబినెట్ మంత్రులతో జరిగిన అల్పాహార సమావేశం అనంతరం ధృవీకరించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే పదవి వీడే సమయంలో కూడా సిద్ధరామయ్య రాజకీయంగా నిశ్శబ్దంగా వెళ్లిపోవాలని భావించడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా ఆయన తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు తన వారసుడిగా భావిస్తున్న డీకే శివకుమార్ (డీకేఎస్), అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పెద్ద రాజకీయ సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ రూపొందించిన సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే నివేదికను సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా అధికారికంగా స్వీకరించింది. ఈ నివేదిక 2017 నుంచే సిద్ధంగా ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు అమలులోకి రాలేదు. 2023లో మళ్లీ అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ప్రభుత్వం 2025లో మరోసారి తాజా కుల సర్వే నిర్వహించింది. ఇప్పుడు ఆ నివేదికను అంగీకరించడం రాజకీయంగా కీలక మలుపుగా మారింది.
ముఖ్యంగా, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేముందు ఈ నివేదికను అంగీకరించడం ద్వారా సిద్ధరామయ్య తనను కర్ణాటకలో అత్యంత ప్రభావవంతమైన వెనుకబడిన వర్గాల నాయకుడిగా ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారని విశ్లేషణలు చెబుతున్నాయి.
కర్ణాటకలో రెండు కులగణన సర్వేలు
గత తొమ్మిదేళ్లలో కర్ణాటకలో రెండు కుల సర్వేలు జరిగాయి. ఈ రెండు సర్వేల సమయంలోనూ సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా ఉండటం విశేషం. సిద్ధరామయ్య తొలి ముఖ్యమంత్రి పదవీకాలంలో హెచ్. కాంతరాజ్ నేతృత్వంలో మొదటి కుల సర్వే నిర్వహించారు. ఈ నివేదిక 2017 నాటికే సిద్ధమైంది. అయితే లింగాయతులు, వొక్కలిగల వంటి ఆధిపత్య కులాల నుంచి వ్యతిరేకత రావడం, అసలు రికార్డులు లేకపోవడం, కొన్ని పత్రాలపై సంతకాలు లేకపోవడం వంటి సాంకేతిక కారణాలు, అలాగే రాజకీయ సున్నితత్వం కారణంగా ఈ నివేదికను అమలు చేయలేదు.
2023లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నివేదికను అంగీకరించే దిశగా అడుగులు వేసింది. అయితే 2025 మేలో పాత డేటా పదేళ్ల కిందటిదని, తాజా సమాచారం అవసరమని, వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయని, చట్టపరంగా సమీక్ష అవసరమని చెబుతూ మరోసారి తాజా కుల సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ తాజా కుల గణన నివేదిక 2025 నవంబర్ నుంచే సిద్ధంగా ఉంది.
డీకే శివకుమార్‌కు ఎందుకు ఇది పెద్ద తలనొప్పి?
సిద్ధరామయ్యకు ఈ కులగణన నివేదిక రాజకీయ వారసత్వంగా మిగిలిపోవచ్చు. కానీ డీకే శివకుమార్‌కు మాత్రం ఇది ఆయన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సమస్యగా మారే అవకాశముంది. 2025లో నిర్వహించిన తాజా సర్వేలో దాదాపు 5.9 కోట్ల మంది వివరాలు సేకరించినట్టు సమాచారం. ఇది భారతదేశంలో ఈ రాష్ట్రం నిర్వహించిన అతిపెద్ద కుల గణనల్లో ఒకటిగా భావిస్తున్నారు. అధికారిక గణాంకాలు ఇంకా బయటకు రాకపోయినా, లీకులు మరియు గత సర్వే ఆధారాల ప్రకారం వెనుకబడిన వర్గాలు, ఇతర ఓబీసీ వర్గాలు కలిపి కర్ణాటక జనాభాలో దాదాపు 69.6 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లింలు సుమారు 14 శాతం జనాభాతో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నారని సమాచారం. మరోవైపు లింగాయతుల జనాభా సుమారు 11 శాతం, వొక్కలిగల జనాభా 10 నుంచి 12 శాతం మధ్యలో ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి.
దశాబ్దాలుగా కర్ణాటక రాజకీయాలు లింగాయతులు, వొక్కలిగల చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ సిద్ధరామయ్య “అహిందా” రాజకీయాలతో ఈ ఆధిపత్యాన్ని సవాలు చేశారు. “అహిందా” అంటే అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వర్గాలు, దళితుల కలయిక. ఈ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయ శక్తిగా మార్చడమే సిద్ధరామయ్య వ్యూహం.
ఆధిపత్య కులాల్లో పెరుగుతున్న ఆందోళన
సర్వే లీకుల ప్రకారం వెనుకబడిన వర్గాలు, మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుండగా, లింగాయతులు, వొక్కలిగల జనాభా ఇప్పటివరకు భావించిన దానికంటే తక్కువగా నమోదైనట్టు సమాచారం. ఈ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల పంపిణీ, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో మార్పులు రావచ్చన్న భయం కూడా ఉంది. ఇదే డీకే శివకుమార్‌కు అసలు చిక్కుగా మారింది.
డీకే శివకుమార్ కేవలం కాంగ్రెస్‌లో ప్రముఖ నేత మాత్రమే కాదు, వొక్కలిగ సమాజానికి చెందిన అత్యంత ప్రభావశీల నాయకుడు కూడా. కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో తిరిగి బలోపేతం చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నివేదికను సభలో పెట్టినా, అమలు చేసినా లింగాయతులు, వొక్కలిగల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు దీన్ని పక్కన పెడితే సిద్ధరామయ్య ఎంతోకాలంగా కట్టిపడేసిన అహిందా వర్గాలు కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేసే ప్రమాదం ఉంది. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా నష్టమే అన్న పరిస్థితిని సిద్ధరామయ్య సృష్టించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్‌కు సిద్ధరామయ్య సందేశమా?
రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, ఈ నివేదికను అంగీకరించడం ద్వారా సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నా, కర్ణాటక కాంగ్రెస్‌లో తన ప్రభావం కొనసాగుతుందనీ, అహిందా రాజకీయాలను ఎవరూ విస్మరించలేరనీ చెప్పే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.
సిద్ధరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో ఆయన కులానికి చెందిన కురుబా సమాజం రాయచూరులో ఆందోళనలు చేపట్టింది. కర్ణాటకలో అధికారం మార్పుకు కాంగ్రెస్ హైకమాండే కారణమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ రాజకీయాలకు వెళ్లని సిద్ధరామయ్య
కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యకు కేంద్ర స్థాయిలో కీలక బాధ్యతలు ఇవ్వాలని భావించినప్పటికీ, ఆయన ఢిల్లీ రాజకీయాల కంటే కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే కులగణన నివేదికను తన రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుని రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని కొనసాగించాలని చూస్తున్నారని భావిస్తున్నారు.
రాహుల్ గాంధీకి ఇది ఎందుకు పెద్ద పరీక్ష?
కర్ణాటక కులగణన కేవలం డీకే శివకుమార్‌కు మాత్రమే కాదు, రాహుల్ గాంధీకి కూడా పెద్ద రాజకీయ సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన రాజకీయ అజెండాగా మార్చింది రాహుల్ గాంధీనే. “కులగణన అంటే సమాజానికి ఎక్స్‌రే” అని ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు సరైన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితమైన కుల గణాంకాలు అవసరమని కాంగ్రెస్ వాదిస్తోంది. కానీ ఇప్పుడు కర్ణాటకలోనే కులగణన నివేదిక అమలుపై కాంగ్రెస్ వెనుకడుగు వేస్తే, రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్న “సామాజిక న్యాయం” రాజకీయాలకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది.
సిద్ధరామయ్య చివరి ఎత్తుగడ విజయవంతమైందా?
సిద్ధరామయ్య స్థానంలో ఓబీసీ నేతను కాకుండా, ఆధిపత్య కులానికి చెందిన డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా తీసుకురావడం వల్ల ఇప్పటికే అహిందా వర్గాల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కులగణన నివేదికతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. ఈ నివేదికను అమలు చేస్తే ఆధిపత్య కులాలు ఆగ్రహిస్తాయి. అమలు చేయకపోతే అహిందా వర్గాలు కాంగ్రెస్‌పై తిరగబడే ప్రమాదం ఉంది. అలాగే రాహుల్ గాంధీ నిర్మించుకోవాలనుకుంటున్న “సామాజిక న్యాయం నాయకుడు” అనే ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్న సమయంలో సిద్ధరామయ్య వేసిన ఈ చివరి రాజకీయ ఎత్తుగడతో డీకే, రాహుల్ ఇద్దరూ క్లిష్ట పరిస్థితిలో పడినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు డీకే శివకుమార్, రాహుల్ గాంధీ ముందున్న అసలు సవాలు – ఆధిపత్య కులాలను కోపగించాలా? లేక అహిందా వర్గాల విశ్వాసాన్ని కోల్పోవాలా? అన్నదే. అందుకే సిద్ధరామయ్య ఈ చర్యను రాజకీయ వర్గాలు “నిశ్శబ్ద ప్రతీకారం“గా అభివర్ణిస్తున్నాయి.
అవినాష్ కటీల్ (మూల కథనం: NDTVలో ప్రచురితం)
