22(ఏ) భూముల నుంచి విముక్తి..
ఇప్పటికే 72 కేసుల్లో 282 ఎకరాలకు విముక్తి కల్పించాం
పట్టాదారుల కేసులను పారదర్శకతతో పరిశీలిస్తున్నాం
స్పెషల్ డ్రైవ్‌తో కేసుల పరిష్కారం వేగవంతం
రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా కృషిచేస్తున్నాం
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : నిషేధిత భూముల (22-ఏ) జాబితాలో పొరపాటున నమోదైన భూములకు సంబంధించి పట్టాదారులకు సత్వర న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిశీలిస్తూ 22(ఏ) కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూ హక్కులను పరిరక్షించేందుకు ప్రత్యేక దృష్టిసారించిందన్నారు.
అర్హులైన ఏ ఒక్క భూ యజమాని కూడా అనవసరంగా ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణలు నిర్వహించి, చట్టబద్ధంగా అర్హత ఉన్న భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ యాజమాన్య హక్కులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే 72 కేసులను పరిష్కరించి 282 ఎకరాల భూమికి 22(ఏ) జాబితా నుంచి విముక్తి కల్పించడం జరిగిందన్నారు. 2024లో నాలుగు కేసులకు సంబంధించి 8.95 ఎకరాలు, 2025లో 19 కేసులకు సంబంధించి 105.55 ఎకరాలు, 2026లో ఇప్పటివరకు 49 కేసులకు సంబంధించి 167.91 ఎకరాలకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు.
అర్జీలను పరిష్కరించి రిజిస్ట్రేషన్‌కు వీలుకల్పించిన దరఖాస్తుల్లో అయిదు నుంచి 15 ఏళ్లపాటు సైతం అపరిష్కృతంగా ఉన్నవి కూడా ఉన్నాయన్నారు. ఇలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక కేసులు ప్రస్తుతం పరిష్కారమవుతుండటంతో భూ యజమానులకు ఎంతో ఊరట లభిస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
లబ్ధిదారుల మనోగతం..
22(ఏ) జాబితా నుంచి భూములు తొలగించబడిన పలువురు లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
పంపకాల సమయంలో…
రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ తాతయ్య ఆస్తి పంపకాల సమయంలో 2018 నుంచి భూమి 22(ఏ) జాబితాలో ఉన్నట్లు తెలిసిందని, ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా పరిష్కారం కాలేదన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో సమస్య పరిష్కారమై, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ధృవీకరణ పత్రం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
2016 నుండి 22ఏలో…
రెడ్డిగూడెం మండలానికి చెందిన మరో లబ్ధిదారుడు మాట్లాడుతూ 2016 నుంచి తమ భూమి 22(ఏ) జాబితాలో ఉండేదని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారు ప్రత్యేకంగా స్పందించి నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో తమ కుటుంబానికి ఎంతో ఉపశమనం కలిగిందన్నారు.
రిజిస్ట్రేషన్ కు వెళ్తే తెలిసింది….
విస్సన్నపేట మండలం కొరపాటి రాంబాబు మాట్లాడుతూ 2018లో భూమి విక్రయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు 2016 నుంచే తమ భూమి 22(ఏ) జాబితాలో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించి సమస్య పరిష్కారమవడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఇప్పటికి న్యాయం జరిగింది…
విజయవాడ రూరల్ మండలానికి చెందిన వెంకటరెడ్డి మాట్లాడుతూ, తనకు చెందిన ఒక ఎకరం 45 సెంట్ల భూమి 2018 నుంచి నిషేధిత జాబితాలో ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కేసును పరిశీలించి న్యాయం చేయడంతో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ధృవీకరణ పత్రం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
నాకు అసలు విషయం తెలియదు…
విస్సన్నపేటకు చెందిన హసీనా మాట్లాడుతూ తమ గ్రామంలోని సర్వే నంబర్ 239/5లోని వరి పొలం 2016లో 22(ఏ) జాబితాలో చేర్చారని, అది 2023లో తమకు తెలిసిందన్నారు. అనంతరం పీజీఆర్ఎస్‌లో దరఖాస్తు చేయగా అధికారులు స్పందించి భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
చాలా కాలంగా పెండింగ్…
బండిపాలెం పంచాయతీకి చెందిన గుమ్మ జాలయ్య మాట్లాడుతూ తమ భూమికి సంబంధించిన 92-బి సబ్-డివిజన్ సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉండేదని, ప్రస్తుతం అధికారులు సమగ్రంగా పరిశీలించి సమస్యను పూర్తిగా పరిష్కరించి తమ హక్కులను పునరుద్ధరించారని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు…
ఈ సందర్భంగా లబ్ధిదారులు.. రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా 22(ఏ) కేసులను ప్రత్యేక కార్యాచరణతో వేగంగా పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, రెవెన్యూ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అర్హులైన భూ యజమానులకు న్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిగిలిన అర్హులైన దరఖాస్తుదారుల సమస్యలు కూడా ఇదే వేగంతో పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
