గిరిజన హక్కుల అమలుకు పోరాడుదాం

వికారాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్‌ గిరిజన మహిళా వసతి గృహంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శీను నాయక్‌, వెంకట్‌రాములు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1994లో గిరిజన హక్కులను గుర్తించినప్పటికీ, స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు దాటినా దేశంలో గిరిజన హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వాలు గిరిజన హక్కులను పక్కాగా అమలు చేయాలని కోరారు. గోర్‌ బోలి భాషకు అధికారిక హోదా కల్పించాలని, అన్ని రంగాల్లో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ప్రైవేట్‌ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

గతంలో పోరాడి సాధించుకున్న ఎస్‌ఎంఎస్‌ హాస్టళ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పించాలని, వికారాబాద్‌ జిల్లా ఎస్‌ఎంఎస్‌ హాస్టల్‌ ప్రభుత్వ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని కోరారు. బిర్సా ముండా, కొమురం భీమ్‌, తాను నాయక్‌, సేవాలాల్‌ వంటి గిరిజన పోరాట యోధుల స్ఫూర్తితో హక్కులు సాధించే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతమైనందున గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న గిరిజనులకు అదనంగా రూ.2 లక్షలు మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌. మహిపాల్‌ పాల్గొని గిరిజనులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు విజయ్‌నాయక్‌, రాజునాయక్‌, రామచంద్రనాయక్‌, మహేష్‌, కిషన్‌నాయక్‌, శ్రావణ్‌, గోపాల్‌, వసతి గృహ విద్యార్థినులు పాల్గొన్నారు.