పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్‌

  • నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే చిత్రపటానికి నివాళులు..

ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డితో తనకు ఉద్యమ కాలం నుంచి ఉన్న అనుబంధాన్ని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా, ఆత్మీయ సహచరుడిగా ఉన్న ఆయన మృతి బీఆర్‌ఎస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. పెద్ది కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణంతో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్‌ ఎర్రవెల్లి నివాసం నుంచి నల్లబెల్లికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఆయనకు ఉమ్మడి వరంగల్‌, జనగామ జిల్లాల పరిధిలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు ప్రాంతాల్లో ఘన స్వాగతం పలికారు.

గ్రామాలు, పట్టణాల కూడళ్లలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు కేసీఆర్‌ రాక కోసం ఎదురుచూశారు. దారిపొడవునా కేసీఆర్‌కు అభివాదం చేస్తూ ‘జై తెలంగాణ.. జై కేసీఆర్‌’ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల భారీగా గుమిగూడిన పార్టీ శ్రేణులతో రహదారులు సందడిగా మారాయి.

కేసీఆర్‌ వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, కల్వకుంట్ల సంజయ్‌, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌ జాదవ్‌, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్‌ రాజు, శేరి సుభాష్‌రెడ్డి, క్రాంతి కిరణ్‌ తదితరులు ఉన్నారు.