సంకల్పిస్తే శిఖరాలు.. దేశం కోసం పనిచేస్తే గెలుపు: సీఎం చంద్రబాబు
- గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- గిరిజనుల కోసం రూ.4,764 కోట్ల
- ప్రపంచ బ్రాండ్‌గా అరకు కాఫీ
- గిరిజన యువతకు భారీగా నైపుణ్య శిక్షణ
- అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: గిరిజనుల భవిష్యత్‌కు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యంలో చేశారు. అనంతరం వేదికపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని, ఆదివాసీలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక సామాన్య ఆదివాసీ మహిళగా ప్రారంభమైన ద్రౌపదీ ముర్ము ఒడిశాలో మంత్రిగా, గవర్నర్‌గా పనిచేసి నేడు దేశ రాష్ట్రపతిగా అత్యున్నత స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. ‘‘ఓ సాధారణ మహిళగా ద్రౌపదీ ముర్ము అనే నేను’’ అని భావించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి సాధించి చూపించారని అన్నారు.
అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ప్రధాని మోదీ వంటి వారు కూడా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారేనని సీఎం పేర్కొన్నారు. మన సంకల్పమే ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు.

దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సంకల్పం ఒక్కటే మార్పును తీసుకువస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
‘‘నేను, నా దేశం, నా రాష్ట్రం, నా ఊరు, నా కుటుంబం’’ అనే భావనతో సంకల్పం చేయాలని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజానికి, దేశానికి తాను ఏమి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. దేశం కోసం పనిచేయడం అంటే సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేయడమే కాదని సీఎం స్పష్టం చేశారు. గిరిజన రైతు తన పంటను మెరుగ్గా పండించి దేశం కోసం కృషి చేసినట్టేనని, స్వయం ఉపాధితో సంపాదిస్తున్న మహిళ కూడా దేశం కోసం పనిచేసినట్టేనని అన్నారు.
విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఉద్యోగి, వ్యాపారి, కూలీ ఎవరైనా సరే నిష్టతో, అత్యుత్తమ సామర్థ్యంతో పనిచేస్తే దేశానికి సేవ చేసినట్టేనని చెప్పారు. సమాజానికి ఏమిచ్చాం, దేశానికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ప్రకృతి, పర్యావరణం, నీటి సంరక్షణపై దృష్టి..
ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకొకరు నీటి సంరక్షణ కోసం పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్టే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఒక విజన్ ఉండాలని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ విజన్, తాను 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని తెలిపారు.
దేశానికి మనం ఏం చేస్తున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. ‘‘ఇవాళ్టి నుంచి జాతీయ జెండా స్ఫూర్తిగా పనిచేయాలి.. జాతీయ జెండా, మీ అజెండాతో పనిచేద్దాం’’ అని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా విజయం సాధించడం కూడా నేషనల్ బిల్డింగ్‌లో భాగమేనని, పనిచేసే ప్రతి వ్యక్తి సమాజానికి ఆస్తి అని అన్నారు. సమాజం కోసం పనిచేయడమే గొప్ప దేశభక్తి అని, అందరి గెలుపే దేశం గెలుపు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

అల్లూరి పేరుతో భోగాపురం విమానాశ్రయం..
భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని సీఎం తెలిపారు.విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరిజన బిడ్డలు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ రికార్డు సాధించిందని చెప్పారు. గిన్నిస్ రికార్డు ద్వారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు.

ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం..
గిరిజనులు పోడు వ్యవసాయానికి బదులుగా ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా విలువైన పంటలను ఉత్పత్తి చేస్తున్నారని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 27.39 లక్షల మంది గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రూ.4,764 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఐటీడీఏల ద్వారా గిరిజనుల అభివృద్ధి, జీవన ప్రమాణాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. మౌలిక వసతుల కల్పన, ఉపాధి, ఉద్యోగాలు, నైపుణ్య కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు
2,336 గిరిజన ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ…
2,336 గిరిజన ఆవాసాలకు మిషన్ మోడ్‌లో రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబానికి సురక్షితమైన తాగునీరు, ఆవాసం కల్పిస్తామని, సోలార్ రూఫ్‌టాప్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ’’అడవి తల్లి బాట’’ పేరుతో రూ.1,000 కోట్లతో 905 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామని వెల్లడించారు.
గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్సులు, 108, 104 మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. డిజిటల్ కనెక్టివిటీ కోసం సెల్ టవర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ప్రపంచ బ్రాండ్‌గా అరకు కాఫీ..
25 ఏళ్ల క్రితమే అరకు కాఫీకి నాంది పలికామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు అరకు కాఫీ ప్రపంచ బ్రాండ్‌గా ఎదిగిందని తెలిపారు. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేసేలా గిరిజనులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కాఫీ, మిరియాలు, పసుపు వంటి వాణిజ్య పంటలకు ఏజెన్సీ ప్రాంతం బ్రాండ్‌గా మారాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ కూడా ఆస్ట్రేలియా ప్రధానికి అరకు కాఫీని బహుమతిగా ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి అతిథికి అరకు కాఫీని బహుమతిగా ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌లోనూ అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించామని, దానిని బెస్ట్ గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు.
అటవీ ఉత్పత్తులకు విలువ జోడింపు..
గిరిజన ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులకు విలువ జోడించి మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటిబెల్లం వంటి ఉత్పత్తులకు ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, బ్రాండింగ్ వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
గిరిజనులకు ప్రత్యేక జిల్లాలు..
ఆదివాసీల కోసం ప్రత్యేకంగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసి వారికి ప్రాధాన్యత కల్పించామని సీఎం తెలిపారు. ఎటు చూసినా పచ్చదనం అలరారే గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాన్ని కూడా గణనీయంగా ప్రోత్సహిస్తామని అన్నారు.

19 ఎంఓయూలతో 60 వేల మందికి లబ్ధి..
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేడు చేసుకున్న 19 ఎంఓయూల ద్వారా 60 వేల మందికి లబ్ధి కలుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు కూడా గిరిజన విద్యార్థులను సిద్ధం చేసి, అందరితో పోటీ పడేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగాలు
జీవో నంబర్ 3 ద్వారా గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ జీవోను కొట్టివేశారని, దీనికి ప్రత్యామ్నాయం గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. ఆదివాసీల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
గిరిజనుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం..
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మౌలిక వసతులు కల్పించడం, విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్, పర్యాటకం వంటి రంగాల్లో అవకాశాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజం, రాష్ట్రం, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, నిమ్మక జయకృష్ణ, ఎంపీ శివనాథ్, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

