Tragic incident | ప్రేమ వ్యవహారమే కారణమా?

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలోని గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు (24) కర్నూలు నగరంలోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

పోలీసుల వివరాల ప్రకారం.. బోయజు కొంతకాలంగా కర్నూలులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల తన స్నేహితురాలు ఫోన్‌లో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

యువకుడు ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమా, లేక మరేదైనా వ్యక్తిగత లేదా ఇతర కారణాలున్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తుల వాంగ్మూలాలను నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు.