TrafficJam | రెండు ముక్కలైన లారీ!

TrafficJam | రెండు ముక్కలైన లారీ!
TrafficJam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల సమీపంలో జాతీయ రహదారిపై గుండెలు పిండేసే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద ధాటికి లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవడంతో పాటు రెండు ముక్కలైంది. లారీలోని సరుకు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ఆ సమయంలో మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో టిప్పర్, లారీల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోవడంతో స్థానికులు, పోలీసులు కలిసి అతడిని బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అతివేగం లేదా నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

