న్యాయం చేయాలి అంటున్న గీత కార్మికులు

న్యాయం చేయాలి అంటున్న గీత కార్మికులు

పాలేరు నియోజకవర్గం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో కాలువ పక్కన ఉన్న ఈత చెట్లను తగలబెడుతున్న ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామస్తులు చెట్లను ఎందుకు తగలబెడుతున్నారని ప్రశ్నించగా, గ్రామ సెక్రటరీ కరువు పనులలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నామని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

గతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన గౌడ కులస్తులు చెరువు గట్లు, కాలువ గట్లు వెంట పెద్ద ఎత్తున ఈత చెట్లను నాటారు. అయితే.. ప్రస్తుతం ఆ చెట్లను సంరక్షించాల్సిన బాధ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామంలో గతంలో కూడా గట్టుపై ఉన్న చెట్లను పీకివేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో దమ్మాయిగూడెం గ్రామ గౌడ కులస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎక్సైజ్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

అదేవిధంగా జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మరోసారి ఈత చెట్లు తగలబడుతున్న ఘటనపై గ్రామ గౌడ కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకొని గౌడ కులస్తులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply